‘‘ఆ టైపు పార్టీలు’’ అంటే... జనం పడి చస్తున్నారట

May 26, 2020

రేవ్ పార్టీలు... ఒక‌ప్పుడు హైద‌రాబాదులో గోల‌గోలను రేకెత్తించిన పాశ్చాత్య సంస్కృతి. ఇప్పుడు ఈ గోల హైద‌రాబాద్ లో పెద్ద‌గా వినిపించ‌కున్నా... ఇత‌ర ప్రాంతాల్లో మాత్రం ర‌చ్చ‌ర‌చ్చ చేస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేపథ్యంలో పొలిటిక‌ల్ మంట‌లు రేగుతున్నాయి. ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ ముగియ‌గానే... ఏపీ ఎక‌న‌మిక‌ల్ కేపిట‌ల్‌గా ఎదుగుతున్న సాగ‌ర న‌గ‌రం విశాఖ‌లో జ‌రిగిన ఓ రేవ్ పార్టీ పెను క‌ల‌క‌ల‌మే రేపింది. స్వ‌ల్ప సంఖ్య‌లోనే సంప‌న్నుల పిల్ల‌లు పాలుపంచుకున్న ఈ పార్టీ కార‌ణంగా విశాఖ రేంజిలో ప‌నిచేస్తున్న ఎక్సైజ్ శాఖ‌కు చెందిన కీల‌క అధికారిపై వేటు ప‌డింది.

ఇప్ప‌టికీ ఈ పార్టీకి సంబంధించిన గోల ఇంకా త‌గ్గ‌లేదు. అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి అండ‌తోనే ఈ పార్టీ జ‌రిగింద‌ని సాక్షాత్తు విశాఖ ప‌రిధిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆదివారం చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ వ్య‌వ‌హారం ఎటు తిరిగి ఎవ‌రి మెడ‌కు చుట్టుకుంటుందోన‌న్న ఆందోళ‌న క‌నిపించింది. ఓ వైపు ఈ గోల జ‌రుగుతుండ‌గానే... త‌మిళ‌నాడులోని చెన్నై ప‌రిస‌రాల్లో జ‌రిగిన మ‌రో రేవ్ పార్టీ దేశ‌వ్యాప్త దృష్టిని ఆక‌ట్టుకుంది. 150 మందికి పైగా విద్యార్థులు పాలుపంచుకున్న ఈ పార్టీపై దాడులు చేసిన పోలీసులు చాలా మందినే అరెస్ట్ చేశారు. ఈ పార్టీ వెనుక కూడా పెద్ద‌ల హ‌స్తం ఉంద‌న్న మాట‌లు వినిపిస్తున్నాయి.

ఈ గోల స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే దేశ రాజ‌ధాని ఢిల్లీకి స‌మీపంలోని నోయిడాలో జ‌రిగిన‌ మ‌రో రేవ్ పార్టీ క‌ల‌క‌లం రేపింది. ఈ పార్టీలో ఏకంగా 200 మందికి పైగా విద్యార్థులు మద్యం, మ‌త్తు ప‌దార్థాల సేవ‌నంలో త‌డిసిముద్ద‌య్యారు. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో 30 మందికి పైగా యువ‌తులు కూడా ఉన్నార‌న్న వార్త‌లు పెను క‌ల‌క‌ల‌మే రేపుతున్నాయి. మొత్తంగా ఎన్నిక‌ల వేడి త‌గ్గ‌కుండానే విశాఖలో మొద‌లైపోయిన ఈ రేవ్ పార్టీలు క్ర‌మంగా దేశ‌వ్యాప్తంగా విస్త‌రిస్తున్నాయ‌న్న మాట‌.