బెయిల్ కోసం కొత్త ఆయుధాన్ని తీసిన ర‌విప్ర‌కాశ్‌?

September 17, 2019

ప‌లు నేరారోప‌ణ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ తాజాగా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన విష‌యం తెలిసిందే. సైబ‌రాబాద్ పోలీసుల‌కు.. బంజారాహిల్స్ పోలీసుల‌కు విచార‌ణ‌లో చుక్క‌లు చూపించిన ర‌విప్ర‌కాశ్‌.. త‌న ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ పైనా కొత్త త‌ర‌హా వాద‌న‌ను వినిపించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.
హైకోర్టులో జ‌రిగిన వాద‌న‌ల్లో ర‌విప్ర‌కాశ్ లాయ‌ర్లు.. ప్ర‌భుత్వం త‌రపు లాయ‌ర్లు ఎవ‌రికి వారు ధీటుగా వాద‌న‌లు వినిపించారు. విచార‌ణ‌కు స‌హ‌క‌రించిన ర‌విప్ర‌కాశ్ తీరుతో పాటు.. విచార‌ణ‌కు నోటీసులు ఇచ్చిన‌ప్పుడు ఆయ‌న హాజ‌రు కాకుండా ఉన్న వైనాన్ని ప్ర‌భుత్వం త‌ర‌ఫున న్యాయ‌వాదులు వాదించ‌గా.. ర‌విప్ర‌కాశ్ త‌ర‌పు న్యాయ‌వాది సంచ‌ల‌న విష‌యాల్ని తెర మీద‌కు తీసుకురావ‌టం క‌నిపించింది.
ర‌విప్ర‌కాశ్ త‌ర‌ఫు వాదించిన సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది దిల్ జిత్ సింగ్ అహ్లువాలియా వాద‌న‌లు వినిపిస్తూ.. పోలీసులు 40 గంట‌ల పాటు విచారించార‌ని.. ఇంకా ఎంత కాలం విచారిస్తార‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. టీవీ9 స్టార్టింగ్ లోనూ హ‌వాలా ప‌ద్ద‌తిలో నిధులు వ‌చ్చాయ‌ని.. తాజాగా అమ్మేసిన సంద‌ర్భంలోనూ తీవ్ర‌వాదుల‌కు ఏ రీతిలో నిధులు అందుతాయో.. అదే రీతిలో కొంత మొత్తం వ‌చ్చింద‌న్న సంచ‌ల‌న అంశాన్ని ప్ర‌స్తావించారు.
టీవీ9లో శ్రీ‌నిరాజుకు ఉన్న 90శాతం వాటానుకొనుగోలుకు సైఫ్ మారిష‌స్ తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించార‌ని.. జాతీయ లా ట్రైబ్యుల‌న్ నుంచి సైఫ్ మారిష‌స్ స్టే ఉత్త‌ర్వులు ఉన్నా వేరే వారికి రూ.500 కోట్ల‌కు విక్ర‌యించార‌ని చెప్పారు.
ర‌విప్ర‌కాశ్ త‌ర‌పు లాయ‌ర్ వాద‌న‌ల్ని గ‌మ‌నిస్తే.. పోలీసుల‌పైనా.. టీవీ9 అమ్మేసిన డీల్ లోనూ కొర్రీల్ని తెర మీద‌కు తీసుకురావ‌టంతో పాటు.. ప్ర‌భుత్వం త‌న‌ను టార్గెట్ చేసిన‌ట్లుగా చెప్ప‌టం క‌నిపిస్తుంది. నిజంగానే ప్ర‌భుత్వం టార్గెట్ చేసి ఉంటే.. యుద్ధ ప్రాతిప‌దిక‌న ఆయ‌న్ను అరెస్ట్ చేసేది క‌దా? దాదాపు మూడు వారాల పాటు క‌నిపించ‌కుండా పోయిన‌ప్పుడు.. ఆయ‌న్ను అదుపులోకి తీసుకోవ‌టం విష‌యం కాదు. కానీ.. అలా చేయ‌కుండా ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. సాధార‌ణంగా పోలీసుల విచార‌ణలో అనుస‌రించిన విధానాన్ని సైతం త‌ప్పు ప‌ట్ట‌టం చూస్తే.. ఈ కేసులో తానేం చేయాల‌న్న విష‌యంలో ఫుల్ క్లారిటీ ర‌విప్ర‌కాశ్ కు ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఇక‌.. విచార‌ణ‌లో మౌనంగా ఉండటం హ‌క్కుగా ర‌విప్ర‌కాశ్ అభివ‌ర్ణించ‌టం విశేషం. ఏమైనా.. త‌న బెయిల్ కోసం ర‌విప్ర‌కాశ్ ప‌ట్టుద‌ల‌గా ఉండ‌ట‌మే కాదు.. బెయిల్ రావ‌టానికి వీలుగా త‌న లాయ‌ర్ చేత వాద‌న‌లు వినిపించార‌న్న మాట వినిపిస్తోంది.