థ్రిల్ల‌ర్లు వ‌దిలేసి రొమాన్స్‌పై ప‌డ్డాడే..

May 30, 2020

అల్ల‌రితో మొద‌లుపెట్టి అన‌సూయ‌, అవును లాంటి విభిన్న‌మైన సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచిన ద‌ర్శ‌కుడు ర‌విబాబు. న‌టుడిగా అత‌ను చేసిన పాత్ర‌ల్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే అత‌ను ద‌ర్శ‌కుడ‌వుతాడ‌ని.. ఇలాంటి సినిమాలు తీస్తాడ‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు. హిట్లు ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా త‌న‌దైన శైలిలో డిఫరెంటుగా సినిమాలు తీస్తూ సాగిపోయాడ‌త‌ను. ఐతే తాను తీసే సినిమాల్లోనే ఒక మూస‌లో ప‌డిపోయి ట్రాక్ త‌ప్పాడు ర‌విబాబు. గ‌త కొన్నేళ్ల‌లో అత‌డి నుంచి వ‌చ్చిన అవును-2, అదుగో, ఆవిరి సినిమాలు దారుణ‌మైన ఫ‌లితాలందుకున్నాయి. ఇక అత‌ను సినిమాలు తీయ‌డం మానేస్తే మంచిద‌నే కామెంట్లు ప‌డ్డాయి ఆవిరి చూశాక‌. అయితే ర‌విబాబు మాత్రం ఈ సినిమా త‌ర్వాత పెద్ద‌గా బ్రేక్ కూడా తీసుకోకుండా కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు.
క్ర‌ష్‌.. ర‌విబాబు తీస్తున్న కొత్త సినిమా పేరిది. బికినీ అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న అమ్మాయిని ముఖం క‌‌వ‌ర్ చేసి చూపిస్తూ ప్రి లుక్ వ‌దిలాడు ర‌విబాబు. నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా ఈ సినిమాను అనౌన్స్ చేశాడత‌ను. ఈ టైటిల్.. ఫ‌స్ట్ లుక్ గ‌మ‌నిస్తే ర‌విబాబు త‌న‌కు అల‌వాటైన జాన‌ర్లు వ‌దిలేస్తున్న‌ట్లే ఉంది. ఈ మ‌ధ్య రొమాన్స్ డోస్ ఎక్కువ ఉన్న కొన్ని సినిమాలకు మంచి వ‌సూళ్లు వ‌స్తున్న నేప‌థ్యంలో ర‌విబాబు ఆ జాన‌ర్ వైపు దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. ఎప్ప‌ట్లాగే త‌న ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ బేన‌ర్ మీద ర‌విబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమా అయ్యాక ఏ సురేష్ బాబు లాంటి వాళ్ల చేతికో సినిమా అప్ప‌గించ‌డం మామూలే కావ‌చ్చు. సీనియ‌ర్ ర‌చ‌యిత స‌త్యానంద్ ఈ సినిమాకు ర‌చ‌నా స‌హ‌కారం అందిస్తున్నారు. ర‌విబాబు ఆస్థాన సినిమాటోగ్రాఫ‌ర్ సుధాక‌ర్ రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం స‌మ‌కూరుస్తున్నారు. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లెవ‌రు పోషిస్తున్నార‌న్న‌ది వెల్ల‌డి కాలేదు.