ఎఫ్‌-3లో ఆ హీరో కూడా?

May 25, 2020

అనిల్ రావిపూడిని టాప్ లీగ్ డైరెక్ట‌ర్ల జాబితాలోకి చేర్చిన సినిమా ఎఫ్‌-2. చాలా ఏళ్ల త‌ర్వాత‌ విక్ట‌రీ వెంక‌టేష్ బాక్సాఫీస్ స్టామినాను చూపించిన సినిమా కూడా ఇదే. గ‌త ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం వ‌సూళ్ల మోత మోగిస్తూ పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. దీనికి సీక్వెల్ తీస్తామ‌ని అప్పుడే అనిల్‌తో పాటు నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో ప‌ల‌క‌రించిన అనిల్.. త‌ర్వాత ఈ సినిమా మీదే ప‌ని చేస్తాడ‌ని.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఎఫ్‌-3 పేరుతో కొత్త చిత్రాన్ని మొద‌లు పెడ‌తాడ‌ని వార్త‌లొస్తున్నాయి. సీక్వెల్లో వెంకీతో పాటు వ‌రుణ్ కూడా కొన‌సాగ‌బోతున్నార‌ని ఇంత‌కుముందే అనిల్ క‌న్ఫ‌మ్ చేశాడు.
తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి మ‌రో హీరో తోడ‌వుతున్నాడ‌ట‌. ఆ హీరో మాస్ రాజా ర‌వితేజ అని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కామెడీ చేయ‌డంలో ర‌వితేజ స్ట‌యిలే వేరు. ఎఫ్‌-2 టైపు అల్ల‌రి సినిమాల్లో ర‌వితేజ ఉంటే సంద‌డే వేరుగా ఉంటుంది. అత‌ను ఇంత‌కుముందే అనిల్ రావిపూడితో రాజా ది గ్రేట్ సినిమా చేసి హిట్టు కొట్టిన సంగ‌తి తెలిసిందే. వెంకీ, వ‌రుణ్‌ల‌కు ర‌వితేజ కూడా తోడైతే క‌చ్చితంగా ఎఫ్‌-3లో ఎంట‌ర్టైన్మెంట్ మ‌రో స్థాయిలో ఉంటుంది. ఈ వార‌మే డిస్కో రాజాతో ప‌ల‌క‌రించ‌నున్న మాస్ రాజా.. మ‌రోవైపు క్రాక్ అనే మాస్ ఎంట‌ర్టైన‌ర్లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుత ప్ర‌చారం నిజ‌మే అయితే ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఎఫ్‌-3 సినిమాలో అత‌ను జాయిన‌వుతాడేమో. ఈ చిత్రాన్ని దిల్ రాజే నిర్మించ‌నున్నాడు.