పవన్‌లో ఒక నిజమైన నాయకుడు కనిపించిన వేళ..

June 30, 2020

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు లెక్కకు మిక్కిలి తప్పులు చేశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. క్షేత్రస్థాయిలోకి దిగి పార్టీని నిర్మించడంలో, సమస్యలపై దీర్ఘకాల పోరాటాలు చేయడంలో, తన విధానాల్లో సమర్థవంతంగా జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆయన విఫలమయ్యాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టే జనాలు పవన్‌ను ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా చూడలేదు. ఎన్నికల్లో ఆయన పార్టీని ఆదరించలేదు. ఐతే తప్పులు చేయడం సహజం. వాటి నుంచి ఎలాంటి పాఠాలు నేరుస్తారన్నది కీలకం. పవన్‌ ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నట్లున్నాడు.

ఎన్నికల ముందు ఏడాదికి మించి.. ఎన్నికల అనంతరం ఆయన, జనసేన పార్టీ చురుకైన పాత్ర పోషిస్తుండటం విశేషం. పార్టీకి ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చినా నైరాశ్యం చెందకుండా.. త్వరగా కోలుకుని క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించడం, ప్రజా సమస్యలపై పోరాడటంపై పవన్ నిమగ్నమయ్యాడు.రెండు తెలుగు రాష్ట్రాలకూ ముప్పుగా పరిణమించిన యురేనియం తవ్వకాలపై పవన్ సాగిస్తున్న పోరాటం ప్రశంసలందుకుంటోంది.

తన పార్టీ నేతృత్వంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి శభాష్ అనిపించుకున్నాడు పవన్. ఈ సమావేశం అనంతరం ప్రెస్ మీట్లో పవన్ మాట్లాడిన మాటలు ఆయనలో రాజకీయంగా వచ్చిన పరిణతికి, చిత్తశుద్ధికి తార్కాణంగా నిలిచాయి. తాను యురేనియం సమస్యపై ఇంత గట్టిగా పోరాడటానికి కారణమేంటో పవన్ వెల్లడించాడు.

అనుకోకుండా తాను ఒక చెంచు కుర్రాడిని కలిశానని.. అతను నల్లమల ప్రాంతానికి చెందిన వాడని.. అతడి చేతులో ఫైళ్లతో చాలా బాధతో కనిపించాడని.. తనతో మాట్లాడాలని అనిపించి వెళ్లి అడిగితే.. యురేనియం తవ్వకాల కోసం తన ఊరిని నామరూపాల్లేకుండా చేయాలని చూస్తున్నారని.. దీని వల్ల తన కుటుంబం, భవిష్యత్ ఛిద్రమైపోతుందని ఏడుస్తూ చెప్పాడని.. అధికారుల్ని కలవాలని, తమ బాధ చెప్పుకోవాలని ప్రయత్నించినా కుదరడం లేదని వాపోయాడని.. అతడి బాధ చూసి గుండె తరుక్కుపోయిందని.. మనం ఎంత అభివృద్ధి సాధించినా.. ఇలాంటి వాళ్ల భవిష్యత్‌కు హామీ ఇవ్వలేకపోవడం, వాళ్ల బాధను అర్థం చేసుకోలేకపోవడం దౌర్భాగ్యమని పవన్ చెప్పాడు.

తాను జీవితంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోయినా, తన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాకపోయినా పర్వాలేదని.. కానీ ఇలాంటి ఓ కుర్రాడి జీవితానికి భరోసా ఇచ్చి, అతడి సమస్యను తీర్చగలిగితే.. పార్టీ పెట్టిన ప్రయోజనం నెరవేరుతుందని ఉద్వేగపూరితంగా చెప్పాడు పవన్. ఎంతో పరిణతితో, చిత్తశుద్ధితో పవన్ చెప్పిన మాటలు చూస్తే.. ఆయనలోని నిజమైన నాయకుడు బయటికి వస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.