కుప్పంలో బాబు మెజారిటీ ఎందుకు తగ్గిందంటే?

May 24, 2020

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏళ్లుగా గెలుస్తూ వస్తున్నారు. మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయడం కోసమే తన సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరిని వదిలి చంద్రబాబు చాలా దూరమే వెళ్లిపోయారు. చంద్రబాబును నమ్మిన కుప్పం జనం కూడా ఆయనను వరుసగా గెలిపిస్తూనే వస్తున్నారు. అయితే తాజాగా ముగిసిన ఎన్నికల్లో చంద్రబాబుకు ఆశించిన మెజారిటీ రాలేదు.

ఓట్ల లెక్కింపులో బాబుపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి ఆధిక్యం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడా బాబుపై చంద్రమౌళే పోటీ చేసినా ఎక్కడా బాబుకు ఆయన సరితూగలేదు. మరి ఇప్పుడు చంద్రమౌళికి ఓట్లెలా పెరిగాయి? చంద్రబాబుకు ఆశించిన మెజారిటీ ఎందుకు రాలేదు? అన్న విషయాలపై టీడీపీ కాస్తంత లోతుగానే పరిశీలన జరిపింది. ఈ క్రమంలో కుప్పంలో బాబు మెజారిటీ తగ్గడానికి మూడే మూడు కారణాలంటూ తేల్చేసింది. ఆ మూడు కారణాలు ఏమిటంటే... మోదీ, మనీ, మిషన్లేనట.

ఈ త్రిబుల్ ఎం ఫ్యాక్టర్లే కుప్పంలో బాబు మెజారిటీ తగ్గడానికి కారణమయ్యాయట. మిగిలిన అన్ని ప్రాంతాలను వదిలేసిన మోదీ సర్కారు... చంద్రబాబును ఓడించేందుకే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కుప్పంలో డబ్బు మూటలు దండిగానే దిగాయట. అంతేకాకుండా బాబును ఎలాగైనా ఓడించి తీరాలన్న కసితో ఈవీఎం మెషీన్లను కూడా మోదీ సర్కారు ట్యాంపరింగ్ కు పాల్పడిందని తేలింది. ఇవే అంశాలను సోమవారం జరిగిన సమీక్షలో కుప్పం నేతలు బాబుకు వివరించారు.