చంద్రబాబు హెరిటేజ్ ఎందుకు పెట్టాడు?

May 28, 2020

టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం హెరిటేజ్ కంపెనీని పెట్టి విస్తరించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆ కంపెనీకి చెందిన హెరిటేజ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్లను ఫ్యూచర్ గ్రూప్ కు అమ్మేశారు. హెరిటేజ్ ఫుడ్స్ విభాగం మాత్రమే చంద్రబాబు కుటుంబం వద్ద ఉంది. అయినా... హెరిటేజ్ మొత్తం బాబుదే అని వైసీపీ వ్యూహాత్మకంగా అబద్ధాన్ని ప్రచారం చేస్తోంది. చంద్రబాబును బ్లేమ్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే, తాజాగా తమ కుటుంబ ఆస్తుల వివరాలను నారా లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా హెరిటేజ్ కంపెనీని ఎందుకు పెట్టామో లోకేష్ వెల్లడించారు. 

చాలామందికి రాజకీయాలు వ్యాపారం. డబ్బు కోసమే రాజకీయాల్లోకి వస్తారు. కానీ మా కుటుంబం డబ్బు కోసం రాజకీయాల మీద ఆధారపడకూడదు అని హెరిటేజ్ వ్యాపారం ప్రారంభించింది అని లోకేష్ వివరించారు. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ (హెరిటేజ్ ఫ్రెష్ కాదు) 15 రాష్ట్రాల్లో పాల ఉత్పత్తులను విక్రయిస్తోందని, తమ సంస్థలో 3 వేల మంది పనిచేస్తున్నారని 9 రాష్ట్రాల్లో హెరిటేజ్ కు ఆస్తులు ఉన్నాయని లోకేష్ ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో హెరిటేజ్ కు ఆస్తులు లేవని పేర్కొన్నారు. రాజధాని పరిధికి 30 కిలోమీటర్ల దూరంలో 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు మార్చి నెలలో భూములు కొన్నామని లోకేష్ వివరించారు. 

 

జగన్ పై సెటైర్ 

జగన్ రెడ్డి ఆస్తులను ఈడీనో, సీబీఐనో ప్రకటిస్తే మనకు తెలుస్తోంది గాని ఆయన ఎపుడూ జనాలకు చెప్పడం లేదని విమర్శించారు లోకేష్. జగన్ ఆస్తులను ఆయన నోటితో ఆయనే ప్రకటిస్తే వినాలని ఉంది అంటూ వ్యాఖ్యానించారు. 9 నెలలు అయ్యింది సీఎం అయ్యి. మా మీద ఉత్త ఆరోపణలే గాని ఇప్పటికీ రాజధానిలో మా ఆస్తులున్నాయని నిరూపించలేకపోతున్నారు. నిరూపించిన వారికి మా ఆస్తులు రాసిస్తాం. ఎందుకు గవర్నమెంటు రాజధానిలో ఆస్తులపై మా మీద చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతుందని లోకేష్ ప్రశ్నించారు. 2009కి ముందు జగన్ ఆస్తులు లక్షల్లో ఉండేవి. ఇపుడు 42 వేల కోట్లు దాటాయని ఈడీ చెబితే తెలిసింది. ఇంకా వెల్లడి కావాల్సినవి ఎన్నున్నాయో మరి? అంటే లోకేష్ అన్నారు. దోచుకోకుండా అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.