కేసీఆర్ ప్రేమ కోసం జగన్ కొత్త స్కెచ్

May 26, 2020

ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుండడంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలతో సయోధ్య పేరుతో కేసీఆర్‌తో మితిమీరిన దోస్తీ చేస్తున్న జగన్ మరి ఇతర పొరుగు రాష్ట్రాల సీఎంలతో ఎందుకు సయోధ్యగా ఉండడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా పక్కపక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న వీరిద్దరూ పరస్పర ప్రయోజనాల కోసమే దోస్తీ కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవి రోజురోజుకీ ఎక్కువవుతుండడంతో ఆ  ఆరోపణలు బలపడకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని జనగ్ యోచిస్తున్నారట. అందులో భాగంగా మరో పొరుగు రాష్ట్రం ఒడిశా ముఖ్యమంత్రితో భేటీ కోసం ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం. నీటి పారుదల రంగ సమస్య పరిష్కారం కోసం జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్‌తో భేటీ అవుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టులో భాగమైన నేరడి బ్యారేజ్ ముంపు ప్రాంతానికి చెందిన సమస్య దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉంది. నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల ఒడిశాలో  ముంపునకు గురయ్యే 106 ఎకరాలను ఒడిశా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలి.. ఆ భూమికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. కానీ, ముంపునకు గురయ్యే 106 ఎకరాలు ఎక్కడున్నాయన్న వివరాలు రెండు ప్రభుత్వాల వద్దా లేవు. బ్యారేజ్ నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ వద్ద కూడా ఆ వివరాలు లేకపోవడం గమనార్హం.
ఒడిశా ప్రభుత్వం గత కొన్నాళ్లుగా ఆ  106 ఎకరాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ ఆంధ్రను కోరుతోంది.  ఆ భూమి ఎక్కడెక్కడ ఉంది.. ఏయే సర్వే నెంబర్లలో ఉన్నాయని ఒడిశా సర్కార్ అడుగుతోంది. ఎప్పుడో 1961లో అప్పటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు- వంశధార ప్రాజెక్టులో భాగంగా నేరడి బ్యారేజీ నిర్మాణంలో మునిగిపోయే 106 ఎకరాలను ఒడిశా ప్రభుత్వం ఆంధ్రాకు ఇవ్వాలి. అక్కడ నష్టపరిహారం మనరాష్ట్రం చెల్లించాలి. వరద ముంపునుంచి ఒడిశా గ్రామాలను రక్షించేందుకు రక్షణ గోడ నిర్మించాల్సిన బాధ్యత ఏపీదే అంటూ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. అప్పటి నుంచి ఏదో ఒక సమస్య ఒడిశా లేవనెత్తుతూనే ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసమంటూ జగన్ ఒడిశా సీఎం నవీన్‌ను కలవబోతున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఆగస్టు మూడో వారంలో ఈ భేటీ ఉండొచ్చని తెలుస్తోంది. 
అయితే.. ఇది అధికారులు, జలవనరుల మంత్రులు స్థాయిలో పరిష్కారం చేసుకోదగ్గ చిన్న సమస్యే అయినప్పటికీ జగన్ వెళ్లి నవీన్‌ను కలవాలనుకోవడం వెనుక కారణాలున్నాయని.. పొరుగు రాష్ట్రంతో దోస్తీ అంటే కేవలం తెలంగాణతోనే కాదని నిరూపించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ భేటీకి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.