ఏపీలో కరోనా వ్యాప్తికి కారణాలను కనిపెట్టిన ఏపీ

August 03, 2020

దేశంలో అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. పాజిటివిటీ రేటు బాగా తక్కువగా ఉండటం ఏపీ ప్రజలకు ఒక ఊరట. అయినా,  కేసుల సంఖ్యలో మాత్రం ఏపీలో తక్కువేం లేవు. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ తొలి నుంచి డేటాను విశ్లేషించే పనిలో ఉంది. ఆ క్రమంలో కొన్ని కీలక విషయాలను ఏపీ ఆరోగ్య ఆంధ్ర విభాగం కనుక్కుంది.  కరోనా వ్యాప్తి ఎక్కువగా ఎక్కడ నమోదు అవుతుంది, ఎలా నమోదవుతోంది, అది ఎట్లా వ్యాపిస్తోంది అని చేసిన పరిశీలనలో అనేక విషయాలు బయటపడ్డాయి.

మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రెగ్యులర్ హాట్ స్పాట్లు ఉంటున్నాయని పరిశీలనలో తేలింది. మరోవైపు వ్యాప్తి, విస్తరణ పరంగా  కూరగాయల మార్కెట్లు, మాల్స్, మాంసాహార దుకాణాలు ఎక్కువ కారణమని వెల్లడైందని అధికారులు వివరించారు. ఈ విశ్లేషణల ఆధారంగా ప్రభుత్వం... అధికార యంత్రాంగానికి తగిన సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమం మొదలుపెట్టినట్టు  ఏపి వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.