శ్రీదేవి చనిపోయింది ఆ కారణంతోనేనట..

August 03, 2020
CTYPE html>
అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాని విడిచిపెట్టి వెళ్లిపోయి రెండేళ్లు కావస్తోంది. ఆమె హఠాన్మరణం అభిమానుల్ని ఎంతగా కలచివేసిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పైగా ఆమె మరణించిన తీరు.. దానిపై నెలకొన్న సందేహాలు అభిమానుల్ని మరింతగా బాధపెట్టాయి. శ్రీదేవి అసలెలా చనిపోయిందనే విషయంలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి మొదట్లో. ఆమెది సహజ మరణం కాదని కూడా సందేహాలు రేకెత్తాయి. ఐతే ఇప్పటిదాకా శ్రీదేవి చనిపోవడానికి కచ్చితమైన కారణాన్ని ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేదు. ఐతే శ్రీదేవి మరణానంతరం ఆమె జీవిత కథను రాసిన సత్యార్థ్ నాయక్ మాత్రం ఆమె మరణానికి రక్తపోటు (బీపీ)నే కారణం అని నొక్కి వక్కాణిస్తున్నాడు. ఇందుకు ఆయన గత ఉదాహరణలు కూడా కొన్ని వెల్లడించాడు. రక్తపోటే ఆమె పాలిట మృత్యువుగా మారిందని సత్యార్థ్ స్పష్టం చేశాడు.
శ్రీదేవికి బీపీ సమస్య ఉందని ఆమె కుటుంబ సభ్యులే కాక.. ‘చాల్ బాజ్’ సినిమా దర్శకుడు పంకజ్ పరాషర్‌తో పాటు హీరో అక్కినేని నాగార్జున కూడా చెప్పారని.. తమతో కలిసి సినిమా చేసినపుడు ఆమె బాత్ రూంలో పడ్డారని వాళ్లు గుర్తు చేసుకున్నారని సత్యార్థ్ వెల్లడించాడు. అలాగే శ్రీదేవి చెల్లెలు మహేశ్వరిని కూడా కలిశానని.. ఆమె కూడా శ్రీదేవి ఒక సందర్భంలో బాత్ రూంలో పడి ఉండటాన్ని చూసినట్లు చెప్పిందని.. ఒకసారి వాకింగ్ చేస్తుండగా శ్రీదేవి కుప్పకూలిపోయిన విషయాన్ని బోనీ కపూర్ కూడా తనతో చెప్పాడని.. కాబట్టి ఆమె రక్తపోటుతోనే చనిపోయారని బలంగా నమ్ముతున్నట్లు సత్యార్థ్ స్పష్టం చేశాడు. 2018 ఫిబ్రవరి 24లో దుబాయ్‌లో ఓ పెళ్లికి హాజరైన అనంతరం హోటల్‌కు వెళ్లాక స్నానం చేయడానికి వెళ్లిన శ్రీదేవి బాత్ రూంలోనే కుప్పకూలి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భర్త బోనీ కపూర్ ఆమెతో పాటు ఆ హోటల్ గదిలోనే ఉన్నారు.