అమ‌ల విడాకుల‌కు అత‌నే కార‌ణమా?  

August 05, 2020

అమ‌లా పాల్.. ఈ పేరు సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఓ సంచ‌ల‌నం. త‌మిళంలో ఆమె చేసిన తొలి సినిమాలో కొడుకును పెళ్లి చేసుకుని మామ‌తో శృంగారం న‌డిపే పాత్రను పోషించింది. అది పెద్ద దుమారం రేపి.. ఆమెకు వ్య‌తిరేకంగా మ‌హిళా సంఘాలు రోడ్ల మీదికి వ‌చ్చే ప‌రిస్థితి వ‌చ్చింది. ఐతే అలాంటి నేప‌థ్యం నుంచి వ‌చ్చి.. అనూహ్యంగా స్టార్ హీరోయిన్ అయ్యి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది అమ‌ల‌. కెరీర్ పీక్స్ లో ఉండ‌గా.. 23 ఏళ్ల‌కే ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్ ను పెళ్లి చేసుకోవ‌డం ఓ సంచ‌ల‌నం. రెండేళ్లు తిరిగేస‌రికి విజ‌య్ నుంచి విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డమూ అనూహ్య‌మే. అమలా పాల్ సినిమాల్లో నటించడం ఎ.ఎల్.విజయ్ కు ఇష్టం లేదని.. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే విడాకుల దాకా వెళ్లార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అమ‌ల విడాకుల వ‌ర‌కు వెళ్ల‌డంలో ధ‌నుష్ పాత్ర కూడా ఉంద‌ని కూడా అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి.

ఇప్పుడు ఈ ఆరోప‌ణే నిజ‌మంటూ విజ‌య్ తండ్రి అళ‌గ‌ప్ప‌న్ అంటున్నాడు. విజ‌య్-అమల విడాకుల విష‌య‌మై ఆయ‌న తాజాగా స్పందించారు. నేరుగా ధ‌నుష్ పేరు పెట్టి ఆయ‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.``అమల, విజయ్ విడిపోవడానికి కారణం ధనుషే. ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థపై నిర్మించాలనుకున్న సినిమాలో అమలను హీరోయిన్‌గా తీసుకున్నాడు. అమల కూడా ఓకే చెప్పేసింది. ముందు సినిమాలు చేయనని చెప్పి.. ఆ తర్వాత ఇంట్లో వారితో ఒక్కమాటైనా చెప్పకుండా సినిమాను ఓకే చేయడం విజయ్‌కు నచ్చలేదు. దాంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి. అందుకే విడిపోయారు`` అని అళగప్పన్ చెప్పారు. ఐతే ఈ ఆరోప‌ణ‌ల్ని అమ‌ల ఖండించింది. తన విడాకులకు వేరెవరూ కారణం కాదని స్పష్టం చేసింది. విడాకులు తీసుకోవాలనే నిర్ణయం పూర్తిగా త‌న‌దే అని.. అందులో ఇతరులెవరికీ ప్రమేయం లేదని.. ధనుష్ త‌న‌కు మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి అని.. అయినా ఎప్పుడో ముగిసిన విడాకుల వ్య‌వ‌హారం గురించి ఇక‌పై తాను మాట్లాడాలనుకోవడం లేదని ఆమె తేల్చి చెప్పింది.