చంద్రబాబు కాన్ఫిడెన్స్‌కు కారణాలు ఇవే

September 17, 2019

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని పార్టీలు ఎంతో ధీమాను ప్రదర్శిస్తున్నాయి. ఏ పార్టీ నేతలను కదిలించినా తామే అధికారంలోకి వస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టంగా మారింది. దీనికితోడు, ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా మిశ్రమ ఫలితాలను వెల్లడించడంతో ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠ రెట్టింపయింది. అయితే, తెలుగుదేశం పార్టీ విజయం తమదేనని బలంగా చెబుతోంది.. దీనికి కారణం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న కాన్ఫిడెన్సే. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఆయన తమ పార్టీనే విజయం సాధించబోతుందని చెబుతున్నారు. అందుకే ఇక్కడి రాజకీయాలను లైట్ తీసుకుని.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. 

 ఎగ్జిట్ పోల్స్‌లో కొన్ని సంస్థలు టీడీపీ గెలుస్తుందని, మరికొన్ని సంస్థలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పాయి. అయితే, చంద్రబాబు మాత్రం ఎప్పటి నుంచో ‘‘ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరు. రాష్ట్రంలో 18 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుస్తాం. 110 అసెంబ్లీ స్థానాలతో మా గెలుపు ఖాయం. ఇది 120-130 వరకూ వెళ్లొచ్చు. నూటికి నూరు శాతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం’’ అంటూ చాలా కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు. దీనికి కారణం ఆయన దగ్గర ఉన్న సర్వే రిపోర్టులే అని తెలుస్తోంది. కొన్ని కీలక సంస్థలు ఆయనకు పోలింగ్ జరిగిన రోజే సర్వే చేసి రిపోర్టులు అందించాయని సమాచారం. వీటిని ఆధారంగా చేసుకునే తెలుగుదేశం పార్టీ అధినేత విజయంపై ధీమాను ప్రదర్శిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

 దీనికితోడు, ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో మేము సైతం అంటూ ఓటేసేందుకు ఉత్సాహంగా, ఉల్లాసంగా పోలింగ్‌ కేంద్రాలకు కదిలారు. పోలింగ్‌ కేంద్రాలు ప్రారంభం నుంచి ముగిసే వరకు పురుషులతో సమానంగా మహిళలు, యువతులతో కిటకిటలాడాయి. ఎండను సైతం లెక్కచేయలేదు. ఈవీఎంలు మొరాయించినా తమ ఓటు వినియోగం వదులుకోలేదు. గంటలకొద్దీ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో కొనసాగింది. ఆ సమయంలోనూ మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. రాత్రి 10 గంటల వరకు క్యూలో ఉండి తమ ఓటు హక్కును ఆనందంగా వినియోగించుకున్నారు.

 వాస్తవానికి ఇలా ఓటర్లు తమ హక్కును వినియోగించుకుని ప్రభుత్వ పనితీరు పట్ల మద్దతు తెలిపారనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలం చేసిన అభివృద్ధితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, చర్మకారులు, డప్పు కళాకారులు తదితరులకు ప్రతి నెల నిర్ణీత సమయానికి పింఛన్ అందజేయడంతో పాటు, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పథకం కింద డబ్బులు ఇవ్వడం, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ సహా పలు సంక్షేమ పథకాలు టీడీపీకి లాభిస్తాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టిన చంద్రన్న బీమాకు మంచి స్పందన వస్తోంది. వీటన్నింటినీ అంచనా వేసుకునే చంద్రబాబు కాన్ఫిడెంట్‌గా ఉన్నారని వినికిడి.