అమరావతి ఉద్యమం ఇలా అయితే ఎలా?

April 03, 2020

ఏపీలో జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చాలని నిర్ణయించిన నేపథ్యయంలో అమరావతి కేంద్రంగా సాగుతున్న ఉద్యమం సరైన దిశలో సాగడం లేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. విపక్షాలు బలహీనంగా ఉండడం.. విపక్ష నేతలను డిఫెన్సులో నెట్టడంలో పాలక పక్షం సక్సెస్ కావడం.. ఉద్యమాలు చేసిన అనుభవం రాజధాని ప్రాంత ప్రజలకు లేకపోవడం.. ప్రజా సంఘాలు, మేధావులు, వామపక్షాలు ఉద్యమాల్లో కీలకం కాకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ఈ ఉద్యమ ప్రభావం సర్కారును భయపెట్టేంత కనిపించడం లేదు. ఉద్యమంలో ఒరిజినాలిటీ ఉన్నా ఉద్యమ స్వరూపం ప్రభుత్వంలో ఆందోళన కలిగించలేకపోతోంది.
ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్నప్పటికీ, నిరసన తెలుపుతున్నప్పటికీ అది ఆర్గనైజ్డ్‌గా సాగడం లేదు. రాజధాని రైతులు తమ తమ గ్రామాల్లో నిరసనలు తెలుపుతుండుడంతో అవి ఎలాంటి పలితం ఇవ్వలేకపోతున్నాయి.. మీడియా, ప్రభుత్వం దృష్టిని ఆకర్షించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే, ఇందుకు సరైన ప్లానింగ్, వ్యూహరచన కొరవడుతోంది.
గతంలో మహారాష్ట్ర రైతులు, తమిళనాడు రైతులు వివిధ సందర్భాల్లో ఉద్యమాలు చేసినప్పడు వారు దాన్ని దిల్లీ వరకు తీసుకెళ్లగలిగారు. కానీ, ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అధికార పార్టీ దీన్ని టీడీపీ ఉద్యమంగా చిత్రీకరించింది. ఆ ముద్ర తొలగించుకునే వ్యూహాలు తెలుగుదేశం వద్ద లేకపోవడంతో మిగతా పార్టీలు, సంఘాలు యాక్టివ్ పార్టనర్‌షిప్ తీసుకోలేకపోతున్నాయి. సమన్వయం కొరవడుతోంది.
ఇక చంద్రబాబు నుంచి ఇతర టీడీపీ నేతలు కూడా కేవలం ప్రసంగాలు, పరామర్శలకే పరిమితమవుతున్నారు కానీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టగలిగే లాజిక్, వ్యూహాలతో ముందుకు వెళ్లలేకపోతున్నారు. ముఖ్యంగా విశాఖను రాజధాని చేయడం వల్ల ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు తప్ప మిగతా 10 జిల్లాలకు ఎలా నష్టం కలుగుతుందో వివరిస్తూ ఆయా ప్రాంతాల ప్రజలందరినీ ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో విఫలమవుతున్నారు. రాయలసీమలో ప్రజా ఉద్యమాన్ని తేలేకపోతున్నారు. రాయలసీమ కదలిరాకపోతే, రాయలసీమను కదిలించకపోతే ఈ ఉద్యమం నిలబడదు.
చంద్రబాబు తన 40 ఏళ్ల అనుభవాన్ని రంగరించి జాతీయ మీడియాను, జాతీయ నాయకులను ఆకర్షించి ఈ ఉద్యమాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లడంలో వెనుకబడ్డారు. సీఎం జగన్‌ను ఇరుకునపెట్టి, ఆయన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తేలేకపోతున్నారు. అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలోనే జరుగుతున్న సీఏఏ వ్యతిరేక ఉద్యమం దేశాన్ని ఎంతగా కుదిపేస్తోందో చూస్తున్నాం. దానికి కారణం  కచ్చితంగా జాతీయ స్థాయి విపక్షాలేనన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయా పార్టీల అన్ని విభాగాలను ఇందులో ఉపయోగించుకోగలుగుతున్నారు. మీడియా మద్దతు, మేధావుల మద్దతు పొందగలుతున్నారు. కానీ.. ఏపీ రాజధాని ఉద్యమంలో చంద్రబాబు అలాంటి పాత్రను ఇంకా పోషించలేదు.
చంద్రబాబు కుల, ప్రాంత అభిమానంతోనే అమరావతికి మద్దతిస్తున్నారంటూ పాలక వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఇప్పటివరకు ఒక్క చర్యా టీడీపీ తీసుకోలేకపోవడంతో ఈ ఉద్యమం కేవలం అమరావతి ప్రాంతానికే ఎక్కువగా పరిమితమైపోయింది. విశాఖను రాజధాని చేయడంపై రాయలసీమలో ఉద్యమం ఏమాత్రం మొదలుకాలేదు.. ఆ దిశగా కదలాల్సిన అవసరం ఉందన్న విశ్లేషనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి దశలో చంద్రబాబు చురుగ్గా వ్యవహరించాలని, వ్యూహం మార్చాలన్న వాదన వినిపిస్తోంది. ఇపుడు చంద్రబాబు నుంచి ప్రజలు కోరుకుంటున్నది మద్దతు, మాటలు కాదు... ప్రత్యర్థిని చిత్తుచేసే వ్యూహాలు.