MEIL అలజడి : సారుకు ఆట మొదలైనట్లే?

July 04, 2020

స్వల్ప వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార ప్రముఖుడిగా మారిన వ్యక్తుల్లో మేఘ ఇంజినీరింగ్ కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి గురించి చెప్పాలి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్న వారికి కావాల్సిన వ్యక్తిగా మారటం ఆయనకున్న బలంగా చెబుతారు. ఎక్కడిదాకానో ఎందుకు? ఏపీలో టీడీపీ సర్కారు ఉన్నప్పుడు వారి ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆయన.. జగన్ ప్రభుత్వంలోనూ ఆయనకు పెద్దపీట వేస్తున్నారు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడైనా.. ఏ ప్రాజెక్టు విషయంలో అయినా ఆయన పోటీలోకి దిగితే ఆట వేరేలా ఉంటుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పే మేఘ కృష్ణారెడ్డి ఇంట.. ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధిక భాగం మేఘా ఇంజనీరింగ్ కంపెనీనే చేపట్టిన విషయాన్ని మర్చిపోకూడదు.
తనకు వ్యతిరేకంగా ఉండే వారిని దారికి తెచ్చుకునేందుకు కేంద్రం ఐటీ.. ఈడీలను ప్రయోగిస్తుందన్న ఆరోపణలు మోడీ సర్కారు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో తెలంగాణ మీద కన్నేసిన కేంద్రం రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఓపక్క హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేసీఆర్ సర్కారు ఉలిక్కిపడేలా మేఘ పెద్దాయన ఇంట్లో ఐటీ సోదాల ఇప్పుడు కొత్త కలకలంగా మారాయి.
మేఘ పెద్దాయన ఇంట నిర్వహిస్తున్న సోదాలతో కేసీఆర్ అండ్ కోకు పంపాల్సిన సందేశాన్ని పంపారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. నిర్మాణ రంగం నుంచి వివిధ కాంట్రాక్టులతో పాటు.. మీడియా రంగంలోకి అడుగు పెట్టిన వేళ.. సోదాలు జరగటం గమనార్హం. ఇటీవల కాలంలో కేంద్రానికి.. కేసీఆర్ సర్కారుకు మధ్య గ్యాప్ పెరుగుతుందన్న వార్తలు వస్తున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర బిగ్ బాస్ కు అత్యంత సన్నిహితుడి ఇంట్లో సోదాలు కొత్త ఆటకు తెర తీసినట్లేనని చెప్పాలి.
తాజాగా నిర్వహించిన సోదాలతో కీలక పత్రాలు.. డాక్యుమెంట్లు లభించినట్లుగా చెబుతున్నారు. దీనికి భిన్నంగా మేఘ వెర్షన్ వేరుగా ఉంది. తమ ఎండీ నివాసంలోనూ.. కార్యాలయాల్లో జరుగుతున్న ఐటీ సోదాలన్ని రోటీన్ గా చేసే తనిఖీలుగా చెబుతూ ఒక నోట్ ను విడుదల చేసింది.
కొసమెరుపు ఏమంటే.. సదరు నోట్ లో.. ఈ సోదాల వివరాల్ని ఇగ్మోర్ చేయాలని కోరారు. రోటీన్ అయినప్పుడు రాసుకున్నోడికి రాసుకున్నంత అని వదిలేయొచ్చుగా? రిక్వెస్ట్ లాంటి సూచన ఎందుకంటారు? మొత్తంగా చూస్తే.. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాల్లో భాగంగానే మేఘ పెద్దాయన ఇంట్లో సోదాలు జరిగిన మాట బలంగా వినిపిస్తోంది. ఇదెంత వరకూ నిజమన్నది రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు స్పష్టం చేస్తాయని చెప్పక తప్పదు. 

Read Also

చిరంజీవి అవసరం లేని తాపత్రయం - జగన్ కోసం ఆరాటం
టీవీ9 లో విజయసాయిరెడ్డి స్లీపింగ్ పార్ట్ నర్ ?
పచ్చి మోసం... పెద్ద డ్రామా !!