ఇన్ని దరిద్రాలు ఏకమైతే.. సినిమా పోకుండా ఉంటుందా?

June 02, 2020

సెంటిమెంట్లు తొక్కా ఏమీ లేవని కొట్టి పారేస్తారు కానీ.. కొన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే నిజమే కదా? అన్న భావన కలుగక మానదు. తాజాగా దారుణమైన డిజాస్టర్ గా మారిన సాహో ఫెయ్యిలూర్ వెనుక ఉన్న లెక్కల్ని చెబుతున్నప్పుడు.. నిజమే కదా? అన్న భావన కలుగక మానదు.
మొదటి సినిమాతోను మెరిపించిన దర్శకుడు.. ప్రభాస్ లాంటి పె..ద్ద హీరో.. అందునా బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా కావటం.. రూ.350 కోట్ల భారీ బడ్జెట్.. హాలీవుడ్ టెక్నిషియన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే.. పిచ్చ బోలెడన్ని సానుకూల అంశాలు సాహోలో కనిపిస్తాయి. అదే సమయంలో ప్రతికూలతలు కూడా చాలానే ఉన్నాయని చెప్పక తప్పదు.
సాహో డిజాస్టర్ కు చాలానే కారణాలు ఉన్నాయని చెబుతూ.. అందుకు తగ్గట్లే చెబుతున్న పాయింట్లు వింటే.. నిజమే కదా? అన్న భావన కలుగక మానదు. బాలీవుడ్ నటుడు జాకీష్రాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు తక్కువేం కావు. బోలెడన్ని హిట్ సినిమాల్లో నటించారు. అలాంటి ఆయన.. తెలుగులో నటిస్తే చాలు.. ఆ సినిమాకు మూడిందే అన్న సెంటిమెంట్ ఉంది. పిచ్చి మాటలు మాట్లాడతారే అనుకోవచ్చు. కానీ.. ట్రాక్ రికార్డు చూస్తే.. అదెంత నిజమో ఇట్టే తెలిసి వస్తుంది.
బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించే ఆయన.. తెలుగువరకు వస్తే మాత్రం.. ఆయన నటిస్తే.. ఆ సినిమా డిజాస్టరే. అందుకు ఆయన నటించిన అస్త్రం..శక్తి.. పంజా లాంటి సినిమాలు నిదర్శనంగా చెప్పొచ్చు. అనకూడదు కానీ.. తెలుగు వరకూ వస్తే.. జాకీష్రాప్ ను ఐరెన్ లెగ్ గా అభివర్ణించే వారు లేకపోలేదు.
మరో ఆసక్తికరమైన సెంటిమెంట్ చెబుతారు. దర్శకుడిగా శంకర్ ను ఎవరూ వంకపెట్టరు. ఆయన తీసిన సినిమాలు ఎంతటి విజయం సాధిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన చిత్రంలో నటించిన హీరోయిన్ ఎవరైనా సరే.. తర్వాత ఆవకాశాలు పెద్దగా రావనే చెబుతారు. ఆయన సినిమాల్లో నటించిన హీరోయిన్లు.. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఇదే తరహాలో జక్కన్న డైరెక్షన్ లో నటించిన హీరోలకు.. ఆయన తర్వాత చేసే సినిమాలతో మూడటం మామూలే. రాజమౌళితో ఒక సినిమా చేశాక.. ఆ తర్వాత కచ్ఛితంగా ప్లాప్ కావటం ఖాయం. దీనికి నిదర్శనంగా స్టూడెంట్ నెంబరు వన్.. సింహాద్రి.. యమదొంగ చిత్రాల్లో నటించిన తారక్.. తర్వాత ఎదుర్కొన్న ప్లాపుల సంగతిని మర్చిపోకూడదు. అంతేనా రాంచరణ్ కెరీర్ లో మర్చిపోలేని మగధీర లాంటి భారీ హిట్ తర్వాత కూడా రామచరణ్ కు భారీ ఎదురుదెబ్బ ఆరెంజ్ తో తగిలింది. అంతేనా..? విక్రమార్కుడు తర్వాత రవితేజకు.. ఖతర్నాక్ రూపంలో ఫెయిల్యూర్ ఎదురైంది. రాజమౌళితో ప్రభాస్ చేసిన ఛత్రపతి సినిమా తర్వాత కూడా పౌర్ణమితో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దీనికితోడు టాలీవుడ్ దర్శకులకు ద్వితీయ విఘ్నం అన్నది కూడా ఉండనే ఉంది. ఇది కూడా సాహో దారుణ డిజాస్టర్ కు ఒక కారణంగా చెబుతున్నారు. ఇలా అనేక సెంటిమెంట్లు ఒక్కసారిగా మీద పడితే ఎంత సాహో అయినా స్మాషే అన్న మాట కొందరి నోట వినిపిస్తోంది.