వన్ మంత్ లో రాష్టాన్ని పడుకోబెట్టేసిన జగన్

July 04, 2020

ఇటీవలే జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఓడినోళ్లు కారణాలపై దృష్టి పెడితే... గెలిచినోళ్లు మాత్రం సంబరాల్లో మునిగిపోయారు. ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉన్నా... ఏపీలో మాత్రం పరిస్థితి ఇలాగే ఉందని చెప్పాలి. టీడీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్న ఆ పార్టీ నేతలు ఇంకెంతమాత్రం ఆలస్యం చేయకుండానే ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పలు కీలక పరిణామాలపై వారు తమదై శైలిలో నినదిస్తున్నారు. అయితే మొన్నటిదాకా విపక్షంలో ఉండి... ఇటీవలే అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇంకా సంబరాల్లోనే తేలియాడుతున్నట్లుగానే కనిపిస్తున్నారు.

మే 23 ఫలితాలు వస్తే... అదే నెల 30న ఏపీకి నూతన సీఎంగా పదవీ ప్రమాణం చేసిన జగన్... ఇప్పటిదాకా ఏమేం చేశారన్న విషయాలను పరిశీలిస్తే... ప్రమాణ స్వీకారం తర్వాత కాస్తంత గ్యాప్ తీసుకున్న జగన్ తన చాంబర్ లోకి ప్రవేశాన్ని కూడా అట్టహాసంగానే చేసుకున్నారు. ఆ తర్వాత ఓ నాలుగు ఫైళ్లపై సంతకాలు చేశామనిపించారు. ఇక తన ఇష్ట దైవంగా భావిస్తున్న స్వరూపానంద సరస్వతిని సందర్శించడం, ఆయన పాదాలను స్పర్శించడం తదితరాలను కూడా జగన్ బాగానే చేశారు. ఆ తర్వాత సొంత రాష్ట్రంలోని సమస్యలను గాలికొదిలేసిన జగన్... పొరుగు రాష్ట్రం సీఎంతో మంతనాలు అంటూ హడావిడి చేశారు. ఈ హడావిడి ఇప్పుడప్పుడే ముగిసేలా లేదన్న వాదనే వినిపిస్తోంది.

పనిలో పనిగా విడతలవారీగా అధికారులను బదిలీ చేసేసిన జగన్... ఐఏఎస్, ఐపీఎస్ ల ముందు తనదైన దర్పాన్ని ప్రదర్శించుకునేందుకు కూడా చాలా సమయాన్నే వెచ్చించారని చెప్పాలి. ఆ డాబూ దర్పంలో భాగంగానే సర్కారీ సొమ్ముతో కట్టిన ప్రజా వేదికను సింగిల్ వర్డ్ తో కూలగొట్టేయించారు. మొత్తంగా ఈ నెల రోజుల పాటు జగన్ తాను ముందే రచించుకున్న వ్యూహం మేరకు తనదైన శైలి సంబరాలను కొనసాగించారు. ఈ లోగా ఖరీప్ రానే వచ్చింది. అప్పటికే ఖరీఫ్ కు సిద్ధమైపోయిన అన్నదాతలు పొలాలు దుక్కి దున్ని విత్తనాల కోసం వేచి చూస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ పట్టించుకునే అధికార యంత్రాంగం లేక... విత్తనాల కోసం అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. అయినా కూడా జగన్ సర్కారు పెద్దగా స్పందిస్తున్న దాఖలా కనిపించలేదు. ఈ క్రమంలో 30 రోజుల పాటు సంబరాలు చేసుకున్నారు కదా సార్... ఇకనైనా రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించండి అంటూ రాష్ట్ర ప్రజలు... ప్రత్యేకించి విత్తనాల కోసం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు జగన్ పై విరుచుకుపడుతున్నారు. మరి జగన్ ఎప్పుడు మేల్కొంటారో చూడాలి.

సింపుల్ గా చెప్పాలంటే...

కూల్చివేతలు

కాళ్లు మొక్కడాలు

సత్కారాలు

ఆశీర్వాదాలు

బదిలీలు

పదవుల పందేరాలు

తెలంగాణకు ఆస్తులు

ఆంధ్రాకు పంగనామాలు...

ఇవీ 30 రోజుల్లో జగన్ విజయాలు.