కరోనా వేళ.. ఏపీలో మీడియాకు గైడ్ లైన్స్

June 03, 2020

అక్కడెక్కడో చైనాలోని వూహాన్ మహానగరంలో పుట్టిన కరోనా వైరస్ (కొవిడ్ 19) మన దగ్గరకు రావటమా? అన్న మాట కొద్ది రోజుల క్రితం వరకూ ఉండేది. ఇప్పుడా వైరస్ వచ్చేయటమే కాదు.. కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చేలా చేసింది. కరోనా కారణంగా వాస్తవాలు కొన్ని అయితే.. అవాస్తవాలు విచ్చలవిడిగా షేర్ అవుతూ.. వైరల్ అవుతున్నాయి. ఇలాంటివేళ.. అనవసరమైన సమాచారాన్ని వ్యాపించే విషయంలో కట్టడి చేసేందుకు వీలుగా ఏపీ సర్కారు మీడియాకు సరికొత్త మార్గదర్శాల్ని డిసైడ్ చేసింది.

కరోనా వైరస్ కు సంబంధించిన కథనాలు.. వార్తలు.. ఇతర సమాచారాన్ని టీవీ.. దినపత్రికలు.. ఇతర మీడియాలలో ఎలా కవర్ చేయాలన్న దానిపై ఏపీ సర్కారు సరికొత్త మార్గదర్శకాల్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం..  కరోనా వైరస్ పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతి రోజూ బులిటెన్ విడుదల చేస్తుంది. అందులో పేర్కొన్న సమాచారాన్ని మాత్రమే పత్రికలు. టీవీలు పరిగణలోకి తీసుకోవాలే తప్పించి.. తమ సోర్స్ నుంచి అంటూ కొత్త సమాచారాన్ని ప్రజలకు అందించకూడదు.

%  కరోనా వైరస్‌ కేసులు, వైరస్‌ వల్ల మరణాల విషయంలో అధీకృత సమాచారం లేకుండా ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు.

%  మార్చి 20న విశాఖలో కరోనా వైరస్‌తో మరణం అంటూ పలు వార్తా సంస్థలు, చానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసి.. ప్రజల్లో లేనిపోని భయాల్ని విపరీతంగా పెంచేశాయి.

%   అనుమానిత కేసుల పేరుతో సమాచారాన్ని ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు. కరోన వైరస్‌ సోకి పాజిటివ్‌గా వచ్చిన కేసుల విషయంలో బాధితుల పేర్లు, చిరునామాలు ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు.

%  ఆధారాలు లేకుండా.. అధికారికంగా కాని అంశాల్ని.. వదంతులు, ఊహాజనిత అంశాలను ప్రసారం చేయరాదు, ప్రచురించరాదు.

%  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వెబ్‌సైట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్లలో ఉండే వైరస్ సమాచారాన్ని తీసుకోవాలి.

%  మూఢ నమ్మకాలను వ్యాప్తి చేసేలా సమాచారాన్ని ప్రచురించరాదు, ప్రసారం చేయకూడదు.

%   ఒకవేళ ఇందుకు భిన్నంగా.. ప్రజల్ని ఆందోళనకు గురి చేసేలా సమాచారాన్ని ప్రసారం చేసినా.. అచ్చేసినా అలాంటి మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంటారు.

%  కరోనా వైరస్‌ నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రసార మాధ్యమాల తమ వంతు సాయాన్ని అందజేయాలి.