అజ్ఞాతంలోకి రేవంత్‌...ప్ర‌గతిభ‌వ‌న్ చుట్టూ సోదాలు

February 25, 2020

ఆర్టీసీ స‌మ్మె ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప‌టికే దాదాపుగా 20 రోజుల‌కు స‌మ్మె చేరుకోవ‌డం, చ‌ర్చ‌ల విష‌యంలో...ప్ర‌భుత్వం - కార్మికులు త‌మ వైఖ‌రినే కొన‌సాగించ‌డంతో...ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతోంది. మ‌రోవైపు పాఠ‌శాల‌లు తెరుచుకుంటున్న నేప‌థ్యంలో...అంద‌రి దృష్టి ఆర్టీసీ స‌మ్మె ముగింపు ఎలా ఉండ‌నుంద‌నే అంశంపైనే ప‌డింది. ఈ స‌మ‌యంలో...ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి  కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్ నేత‌ల‌ను హౌస్ అరెస్ట్ చేశారు. కాగా, ఎంపీ రేవంత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ల‌డం ఉత్కంఠ‌ను రేకెత్తిస్తోంది.
ఆర్టీసీ కార్మికుల‌కు సంఘీభావంగా ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా బ‌య‌ల్దేరేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధ‌మ‌య్యారు. దీంతో పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ స‌హా ముఖ్య‌నేత‌ల‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డిని ఇంటిని సైతం పోలీసులు ముట్ట‌డించారు. అయితే, కొద్దిసేప‌టికి రేవంత్ రెడ్డి త‌న ఇంట్లో లేర‌నే విష‌యం తెలిసింది. దీంతో రేవంత్ అనుచరుల ఇళ్లలోనూ పోలీసులు చెక్ చేసినట్లు స‌మాచారం. అయినా రేవంత్ రెడ్డి ఆచూకీ దొరకలేదు. దీంతో, పోలీసులు టెన్షన్‌లో ఉన్నారు.
ఇదిలాఉండ‌గా, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి పిలుపును పోలీసులు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర  పటిష్ట బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. ఎప్పుడూ లేని విధంగా దాదాపు 15 వందల మంది పోలీసులను  మోహరించారు. మ‌రోవైపు వరంగల్, వర్ధన్నపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, జగిత్యాల, సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్లకు తరలించారు. ఇదిలాఉండ‌గా, ప్ర‌గ‌తిభ‌వ‌న్ వైపు నిరసనకారులు వచ్చే అవకాశముందనే కారణంగా అధికారులు బేగంపేట మెట్రో స్టేషన్‌కు తాళం వేశారు. జిల్లాల్లో కూడా ఎక్కడి కక్కడ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న అన్ని హోటల్స్ పోలీసులు చెక్ చేస్తున్నారు.