కేటీఆర్ ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా?

July 03, 2020

కేసీఆర్ 2014లో సీఎం అయినపుడు కేవలం 8 కోట్లున్న కేటీఆర్ ఆస్తి... ఇపుడు 41 కోట్లు ఎలా అయ్యిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ఈ ఆరేళ్లలో తీసుకున్న జీతాలన్నీ కలిపినా ఇంత ఆస్తి అవదు కదా? మరి ఎలా పెరిగింది ఇంత ఆస్తి... దీనిపై వెంటనే విచారణకు ఆదేశించమని ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగలేఖ రాశారు. రియల్ ఎస్టేట్ మాఫియాకు అధికార అండదండలు అందిస్తూ కేటీఆర్ కోట్లకు పడగలు ఎత్తుతున్నాడు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టారు.

హైదరాబాదు శివార్లలో 111 జీవో ను ఒక రియల్ మాఫియాకు రీమోడీఫై చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. 111 జీవో కింద ఆ కొన్ని గ్రామాలను మాత్రమే ఎందుకు మినహాయింపు ఇవ్వాల్సి వచ్చిందో ప్రజలకు వెల్లడించాలని రేవంత్ డిమాండ్ చేశారు. మినహాయించిన గ్రామాల్లో ఎవరెవరు గత ఐదేళ్లలో ఆస్తులు కొన్నారో కూడా వెల్లడించాలని రేవంత్ రెడ్డి లేఖలో కోరారు. అంతేకాదు... పుప్పాలగూడలో 30 కోట్ల భూమిని 1 కోటి రూపాయలకే కేటీఆర్ ఎలా దక్కించుకున్నారని రేవంత్ ప్రశ్నించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో మీ పార్టీ ఆదాయం గణనీయంగా పెరగడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. 2018లో కేవలం 24 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న మీ పార్టీ ఆదాయం... 2019 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 188 కోట్ల రూపాయలకు చేరినట్టు ఎన్నికల సంఘానికి మీరు సమర్పించిన నివేదికల్లో స్పష్టంగా ఉంది. మీ కుమారుడు కేటి రామారావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాతే ఆదాయం ఇంత భారీ స్థాయిలో పెరగడం గమనార్హం. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం, త్వరలో ముఖ్యమంత్రి పీటం పై కూర్చోబెడతారని ప్రచారం చేయడం, అదే క్రమంలో పార్టీ ఆదాయం ఊహించని స్థాయిలో భారీగా పెరగడం వెనుక రాజకోట రహస్యం ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అంటూ రేవంత్ డిమాండ్ చేశారు. 

 

రేవంత్ రెడ్డి లేఖ పూర్తి వివరాలను ఈ లింకులో చూడొచ్చు... 

https://www.facebook.com/revanthofficial/posts/2694013667345159?__tn__=K-R