ప‌త్రికాధిప‌తితో రేవంత్‌...టార్గెట్ కేసీఆరే

July 05, 2020

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఆ రాష్ట్రంలో గ‌లం విప్పే అతికొద్ది మందిలో...కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి టాప్‌లో ఉంటారు. సంద‌ర్భం ఏదైనా రేవంత్ ఎదురుదాడి ఓ రేంజ్‌లో ఉంటుంది. టీఆర్ఎస్ నేత‌లు సైతం ఒక ద‌శ‌లో డిఫెన్స్‌లో ప‌డేలా ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. రేవంత్ త‌మ‌ను అంత ఇరకాటంలో ప‌డేస్తున్నారు కాబ‌ట్టే....ఆయ‌న ఇలాకా అయిన కొడంగ‌ల్‌లో టార్గెట్ చేసి మ‌రి ఓడించారు. అయితే, అనంత‌రం దేశంలోనే అతిపెద్ద పార్ల‌మెంటరీ నియోజ‌క‌వ‌ర్గం అయిన మ‌ల్కాజ్‌గిరి నుంచి రేవంత్ ఎంపీగా గెలుపొందారనే సంగ‌తి తెలిసిందే. ఇక తాజా విష‌యానికి వ‌స్తే...కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు మ‌రో మీడియా మిత్రుడిని రేవంత్ వెతుక్కున్నారు.

తెలంగాణ రాజ‌కీయాల్లో వార‌స‌త్వంతో వ‌చ్చి త‌న ముద్ర‌ను వేసుకున్న వారిలో మాజీ ఎంపీ వివేక్ ఒక‌రు. ఇట‌వ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల వ‌ర‌కు ఆయ‌న టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. త‌న‌కు ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌న్న పెద్ద‌పెల్లి ఎంపీ టికెట్ విష‌యంలో కేసీఆర్ చివ‌రి నిమిషంలో షాక్ ఇవ్వ‌డంతో....అప్ప‌టివ‌ర‌కు ఉన్న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేసేశారు. ఆనాటి నుంచి కేసీఆర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ జ‌న‌స‌మితి నేత కోదండ‌రాంతో క‌లిసి ప‌లు కార్య‌క్ర‌మాల్లో కేసీఆర్ తీరును తూర్పార‌ప‌డుతున్నారు. అలాంటి వ్య‌క్తితో తాజాగా రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

వివేక్‌కు ప్ర‌ముఖ మీడియా సంస్థ `వీ6` అధిప‌తి అనే సంగ‌తి తెలిసిందే. దీంతో పాటుగా వెలుగు అనే ప‌త్రిక‌ను సైతం ఆయ‌న గ‌త ఏడాది ప్రారంభించారు. ఈ మీడియా సంస్థ‌ల కార్యాల‌యంలోనే తాజాగా వివేక్‌తో రేవంత్‌రెడ్డి స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ఏడు స్థానాల్లో ఓడిపోవడం నుంచి మొద‌లుకొని ప్ర‌స్తుత రాజ‌కీయాలు, ఢిల్లీ ప‌రిణామాలు వంటివ‌న్నీ చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ స‌ర్కారుపై మీడియా సంస్థ‌ల‌తో వ్య‌తిరేక గ‌లం వినిపించాల‌ని రేవంత్ కోరినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి వివేక్ సైతం సానుకూలంగానే స్పందించార‌ని అంటున్నారు. ఈ విష‌యంలో క్లారిటీ రావాలంటే...మ‌రికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.