హరీష్ ను ఆర్టీసీలోకి లాగిన రేవంత్

February 27, 2020

ఆరోజు తెలంగాణ కోసం సకల జనుల సమ్మె చేసినపుడు గుర్తుకురాని నిబంధనలు ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తే గుర్తుకువస్తాయా కేసీఆర్... 45 రోజులు సమ్మె చేసినా ఆనాటి ఆంధ్రాపాలకులు ఎవరి ఉద్యోగాలు తీసేయలేదు కానీ నీవు కనీసం పిలిచి మాట్లాడకుండా నాలుగు రోజుల్లోనే ఉద్యోగాలు పీకేస్తావా... నీకెంత ధైర్యం అంటూ రేవంత్ రెడ్డి గర్జించారు. మధ్యలో హరీష్ రావును కూడా ఆర్టీసీ వివాదంలోకి లాగాడు రేవంత్. గతంలో ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడుగా పనిచేసినా హరీష్ రావు... ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాడు అని ప్రశ్నించాడు రేవంత్. నిజమే... చాలాకాలం గౌరవాధ్యక్షుడిగా చేసిన హరీష్ మొన్నటి ఎన్నికల అనంతరమే ఆ పోస్టుకు రాజీనామాచేశారు. నిజమే... ఆయన ఇంతవరకు దీనిపై స్పందించకపోవడం అన్యాయమనే అనుకోవాలి.

తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడకుండా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు పోరాట పటిమ చూపాలని, ఉద్యోగ సంఘాలు రాజకీయ నాయకులపై ఆధారపడాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి సూచించారు. 19న ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన బంద్ కు తెలంగాణ సమాజం మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. 

తెలంగాణ వ్యతిరేకులను మంత్రిపదవుల్లో కూర్చోెబెట్టి... తెలంగాణ కోసం తమ జీవితం త్యాగం చేసిన కోదండరాం, చుక్కా రామయ్య, వరవరరావు వంటి వారిని అణిచివేసే దొరతత్వం కేసీఆర్ ది అంటూ రేవంత్ రెచ్చిపోయారు. పెన్నులపై మన్ను పోస్తే గన్నులై గర్జిస్తాయన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 

సచివాలయానికి ఆరేళ్లుగా రాని నువ్వు ఆరు రోజులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగానికి రాకుండాపోతే ఉద్యోగాలు పీకేస్తానంటావా అంటూ రేవంత్ విమర్శించారు. ఇపుడు కనుక ఉద్యోగులు ముఖ్యంగా టీచర్లు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవకపోతే భవిష్యత్తుల్లో కేసీఆర్ మిమ్మల్ని పాలెగాళ్లను చేస్తాడని రేవంత్ హెచ్చరించారు.