సైరా రేవంత్‌రెడ్డి.. గులాబీకి టెన్ష‌న్‌

July 07, 2020

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక వేడెక్కబోతోంది. ఎన్నికల ప్రచారానికి గడువు సమిపిస్తండడంతో వివిధ పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగబోతున్నారు. ఈ ఉప ఎన్నిక‌ల ఈ నెల 21న జ‌రుగుతుండ‌గా 24న ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. బ‌రిలో ఎన్ని పార్టీలు, ఎంత మంది అభ్య‌ర్థులు ఉన్నా ప్ర‌ధాన పోటీ మాత్రం టీఆర్ఎస్‌, కాంగ్రెస్ అభ్య‌ర్థుల మ‌ధ్యే ఉంద‌న్న‌ది వాస్త‌వం.
ఇక ఇప్ప‌టికే టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు నిర్వ‌హించి వెళ్లారు. ఆయ‌న మ‌రిన్ని రోడ్ షోలు నిర్వహించాల్సి ఉండ‌గా... తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో అర్దాంత‌రంగా ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న కుదించుకుని వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ షార్ప్ ట్ర‌బుల్ షూటర్ హ‌రీష్‌రావును రంగంలోకి దింపే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక ఓ వైపు ఎన్నిక నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్పుడు కాంగ్రెస్‌లో లుక‌లుక‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్ పై చేయి సాధిస్తే.... ఇప్పుడు ఆ పార్టీ ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
ఎన్నిక టైం ద‌గ్గర ప‌డుతోన్న వేళ కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఇక ఈ ఊపును కంటిన్యూ చేసేలా అక్క‌డ ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ నేత‌, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రచారం రంగంలోకి దిగుతున్నారు. ఈనెల 18,19 తేదీల్లో రేవంత్ హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో అక్క‌డ స‌మీక‌ర‌ణ‌లు మార‌తాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. రేవంత్ ప్ర‌చారానికి వ‌స్తుండ‌డంతోనే టీఆర్ఎస్ కూడా అఘ‌మేఘాల మీద హ‌రీష్‌ను రంగంలోకి దించుతోందంటున్నారు.
ఇక రేవంత్ ప్ర‌చారానికి వ‌స్తుండ‌డంతో కాంగ్రెస్ పార్టీ వాళ్లు అయితే సైరా రేవంత్‌రెడ్డి అంటూ ప్ర‌చార హ‌డావిడి చేస్తున్నారు. మా సైరా వ‌స్తున్నాడంటూ స్థానికంగా సోష‌ల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరే ఇప్పుడు ఒంటిపోరు చేస్తున్నారు. ఆయ‌న‌తో పాటు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి చిన్నా చిత‌కా సాయం చేస్తున్నారు. ఏదేమైనా ఉప ఎన్నిక ప్ర‌చార గ‌డువు ద‌గ్గ‌రు ప‌డుతోన్న కొద్ది స‌మీక‌ర‌ణ‌లు మారుతుండ‌డం.. ఇటు రేవంత్ ఎంట్రీ.. అటు ప్ర‌భుత్వానికి ఆర్టీసీ స‌మ్మె పోటు గ‌ట్టిగా ఉండ‌డంతో గులాబీ ద‌ళంలో గుబులు రేపుతోంది.