​కేటీఆర్ ఫాంహౌస్... రేవంత్ రెడ్డి కొత్త ట్విస్ట్ !

August 13, 2020

తనపై కేటీఆర్ ప్రయోగించిన ఆయుధాన్ని తిరిగి కేటీ రామారావుపై ప్రయోగించి భారీ ట్విస్ట్ ఇచ్చారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి​. ఇటీవలే రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు మంత్రి కేటీఆర్ కి ఎన్జీటీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

జీవో 111 ఉల్లంఘించి కేటీ రామారావు ఫాంహౌస్ కట్టారని... ఇది పర్యావరణ నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణమని రేవంత్ రెడ్డి వాదన. అది తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరా వాడిన రేవంత్ రెడ్డిని అప్పట్లో పోలీసులు అరెస్టు జైల్లో వేశారు. ఆ సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన దర్యాప్తు నివేదికలో ‘‘రేవంత్ రెడ్డి చర్యల వల్ల కేటీఆర్ ప్రాణాలకు, కేసీఆర్ కుటుంబానికి.. ఆస్తులకు ప్రమాదం ఉందని.. బెయిల్ ఇవ్వొద్దు అన్నారని, ఇది ఆ పార్టీ ఎమ్మెల్యే సుమన్, పోలీసులు స్వయంగా  ఆ ఫామ్‌హౌస్ కేటీఆర్‌దే ధృవీకరించడం కాదా అని రేవంత్ ప్రశ్నించారు. 

నాకు ఏ ఆస్తులు లేవు. అది నా ఫాంహౌస్ కాదు అని కేటీఆర్ అంటే... నామీద పెట్టిన కేసులే తప్పుడు కేసులు అవుతాయి కదా అన్నది రేవంత్ రెడ్డి వాదన. అంతేకాదు... కేటీఆర్ తనకు జన్వాడ వద్ద భూములు లేవు అన్నారు. ఆయన ఏ ధైర్యంతో అలా చెప్పారో నాకుతెలియదు. కానీ 2019 మార్చి, 2019 మేలో రెండు భూ లావాదేవీలు జరిగాయని... ఇవి కేటీరామారావు భార్య శైలిమ పేరిట జరిగాయని రేవంత్ సంచలన విషయాలు వెల్లడించారు. 

అంతే కాదు, కేటీఆర్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో 20వ పేజీలో అర్బనా అవెంచర్ పేరు మీద 2కోట్ల 70లక్షల విలువచేసే భూమి ఉందని కేటీఆర్ ప్రస్తావించినట్లు రేవంత్ తెలిపారు. ఇన్ని ఆధారాలు ఉన్న విషయం ఆయన మరిచిపోయాడో ఏమో తెలియదు. భూములు ఉన్నా కేటీఆర్ బుకాయించాలని చూస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఒకవేళ ఇపుడు చెపుతున్నట్లు ఆయనకు భూములు లేకపోతే ... తప్పుడు ఎన్నికల అపిడవిట్ నేరం కింద కేటీఆర్ పదవే పోతుందని రేవంత్ వివరించారు.

ఆయన, ఆయన మనుషులు ఇచ్చిన నివేదికల్లో జన్వాడ గ్రామంలో రెండు ప్రాంతాల్లో కేటీఆర్ కు భూములున్నాయని పక్కా ఆధారాలతో పేర్కొని ఇపుడు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. 1990లో తనపై అక్రమ భూముల ఆరోపణలు వచ్చాయని... ఆనాటి మంత్రి కోనేరు రంగారావు పదవికి రాజీనామా చేశారు. మరి ఈ రామారావును అలాగే తీసేయాలి. అవినీతి ఆరోపణలు అబద్ధం అని తేలాకే మళ్లీ పదవి  చేపట్టాలని రేవంత్ అన్నారు. నా ఆరోపణల్లో ఒక్క అబద్ధం ఉన్నా నేను శిక్షకు సిద్ధం... కేటీఆర్ తెలంగాణ బిడ్డ అయితే... ఈ ఆస్తులు తనవి కాదని ప్రూవ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.