రేవంత్ వ‌ర్సెస్ కోమ‌టిరెడ్డి

May 31, 2020

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల రూటే స‌ప‌రేట్‌.. క‌లిసి న‌డ‌వ‌రు.. ఒక్క‌మాట‌పై నిల‌వ‌రు.. ఎవ‌రిదారి వారిదే.. అంద‌రూ.. ' నా దారి ర‌హ‌దారి ' అనేవాళ్లే.. మొత్తంగా అంద‌రిదీ పురి క‌ల‌వ‌ని ముచ్చ‌టే..! ఒక‌వైపు రాష్ట్రంలో పార్టీ ఉనికిపాట్లు ప‌డుతుంటే.. మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా అధికార టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదగాల‌ని క‌మ‌ల‌ద‌ళం దూసుకొస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో పార్టీ బ‌లోపేతం దృష్టి సారించాల్సిన హ‌స్తం నేత‌లు ప‌ద‌వుల కోసం ఆగ‌మాగం అవుతున్నారు. తాజాగా.. టీపీసీసీ ప‌ద‌వి కోసం ఇద్ద‌రు నేత‌లు నువ్వా.. నేనా..! అన్న‌ట్లు పోటీ ప‌డుతున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

ఇందులో ఒక‌రు భ‌వ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, మ‌రొక‌రు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. వీరిద్ద‌రూ తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 2018లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇవే ఎన్నిక‌ల్లో కోడంగ‌ల్‌లో రేవంత్‌రెడ్డి, న‌ల్ల‌గొండ‌లో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్య‌ర్థుల చేతిలో ఓడిపోయారు. ఇక టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి నాయ‌క‌త్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక ఆయ‌నను త‌ప్పించాల్సిందేన‌ని ప‌లువురు నాయ‌కులు డిమాండ్ కూడా చేశారు.

ఇదిలా ఉండ‌గా, ఆ త‌ర్వాత వ‌చ్చిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి నుంచి రేవంత్‌రెడ్డి,  భువ‌న‌గిరి నుంచి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అనూహ్యంగా విజ‌యం సాధించారు.  అప్ప‌టి నుంచే వీరిద్ద‌రూ టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్ఠానం మెప్పుకోసం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇటీవ‌ల జ‌రిగిన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో సొంత స్థానాన్ని కాపాడుకోలేక‌పోయిన ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఓట‌మికి త‌న‌దే బాధ్య‌త అంటూ ఉత్త‌మ్ ప్ర‌క‌టించారు కూడా.

ఇదే స‌మ‌యంలో టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి కూడా స్వ‌చ్ఛందంగా త‌ప్పుకునేందుకు ఆయ‌న ముందుకు వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అటు రేవంత్‌రెడ్డి, ఇటు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చిన పార్టీ సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్‌ను కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి క‌లిసి.. టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి త‌న‌కే ఇవ్వాల‌ని కోరారు. మ‌రోవైపు రేవంత్‌రెడ్డికి ష‌బ్బీర్ అలీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ హ‌నుమంత‌రావు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అంటే టీపీసీసీ ప‌ద‌వి విష‌యంలో పార్టీలో గ్రూపులు క‌ట్టార‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రిది పై చేయి అవుతుందో చూడాలి మ‌రి.

Read Also

ఆర్టీసీ మీద పగ తర్వాత... సిటీలో దీని సంగతి చూడు కేసీఆర్
సూపర్ ట్విస్ట్... మహా పీఠంపై సర్ ప్రైజ్ సీఎం
ఉండవల్లి శ్రీదేవి- ఎల్వీ సుబ్రహ్మణ్యం... ఈ కథేంటి? దానివెనుక సంగతేంటి?