మల్కాజ్ గిరిలో రేవంత్ గెలుపు... ఇదే లాజిక్

July 20, 2019

మల్కాజ్ గిరి, దేశంలోనే అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గం. కేవలం ఈ ఒక్క గుర్తింపు కారణంగానే కాకుండా, తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మరో ప్రత్యేకతతో కూడా ఈ నియోజకవర్గం వార్తల్లోకి ఎక్కింది. అదే...కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి బరిలో దిగడం. ఆయన్ను ఎలాగైన ఓడించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు ముందుకు సాగడం. కాంగ్రెస్‌ అనూహ్యంగా రేవంత్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో టీఆర్ఎస్ అప్రమత్తమై ఆయనకు గట్టి పోటీనిచ్చేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి టిక్కెట్‌ కేటాయించడమే ఇందుకు నిదర్శనం.

అయితే, ప్రచారం ఒకింత హోరాహోరీగానే సాగింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ తమదైన శైలిలో ఓట్లు అభ్యర్థించాయి. అయితే, ఇంతకీ విజయవం ఎవరిని వరించనుందనే సందేహం సహజంగానే...తెరమీదకు వస్తుంది. అయితే, ఇక్కడ మల్లారెడ్డి అల్లుడి కంటే....రేవంత్ రెడ్డికే ఎక్కువ చాన్సుందనే టాక్ తెరమీదకు వస్తోంది. రేవంత్‌రెడ్డి అన్నీ తానై చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. దీంతోపాటుగా రేవంత్ గెలుపుపై కాంగ్రెస్ పలు కారణాలతో ధీమా వ్యక్తం చేస్తోంది.

మర్రి రాజశేఖర్‌రెడ్డి ఎంపికపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,కార్పొరేటర్లలో తీవ్ర అసంతృప్తి ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు. పార్టీ నేతలు చాలా మంది మనస్ఫూర్తిగా పనిచేయలేదని, ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసి వచ్చిందని చెప్తున్నారు. ‘ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవి కాదు..దేశానికి సంబంధించినవని…అనుభవజ్ఞుడికి మద్దతు తెలిపితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మల్కాజిగిరివాసులు గుర్తించారు.డబ్బులు ముట్టజెప్పి క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను తెరాస తమ పార్టీలో చేర్చుకుంది.అయినా..ఓటర్లు మాత్రం స్వచ్ఛందంగా మాకు మద్దతు తెలిపారుపోలింగ్‌ శాతం తగ్గడం అంతిమంగా తెరాసకే నష్టం.ఎన్నికలకు ముందు చెల్లాచెదురైన మా పార్టీ కేడర్‌ ఒకేతాటిపైకి వచ్చారు. తెదేపాతో పాటు కొన్ని ఇతర పార్టీలు అండగా నిలవడం కూడా కలిసి వచ్చింది. విద్యావంతులు,యువతతో పాటు బస్తీలు,కాలనీలు రేవంత్‌రెడ్డికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపాయి.’అంటూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రేవంత్‌రెడ్డి గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.