రేవతి చౌదరి ప్రశ్నలు ... జగన్ బ్యాచ్ కు బ్యాండ్ పడుతోంది

February 24, 2020

గడచిన ఎన్నికల్లో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో చాలా మంది నేతలు టీడీపీని వీడుతున్నారు. అయితే రాజకీయాలన్నాక... గెలుపు, ఓటమి సహజమేనన్న వాస్తవాన్ని మరిచి అక్షరాలు దిద్దించిన పార్టీని వీడుతున్న నేతలపై ఓ వైపు సెటైర్లు పడుతుంటే... మరోవైపు అవకాశవాద నేతలు ఎందరు పార్టీని వీడినా.. టీడీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్న ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ తరహా విశ్లేషణలు నిజమేనన్నట్లుగా ఇప్పుడు టీడీపీ తరఫున తెర ముందుకు వచ్చిన మహిళా నేత రేవతి చౌదరి పార్టీ స్టాండ్ ను చాలా స్పష్టంగానే  వెల్లడి చేయడంతో పాటుగా వైరివర్గాలకు తడిసిపోయేలా ప్రశ్నలు సంధిస్తున్నారు. 

సోమవారం నాడు ఓ మీడియా సంస్థకు రేవతి చౌదరి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆసక్తి రేకెత్తించింది. ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వంపై సదరు ఇంటర్వ్యూలో రేవతి చౌదరి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే విచారణ చేయొచ్చు కదా అంటూ రేవతి చౌదరి సంధించిన ప్రశ్నలు నిజంగానే వైసీపీ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయనే చెప్పాలి. వైరి వర్గంపై విమర్శలతో పాటుగా ఏ విషయం మీద అయినా పార్టీ స్టాండ్ ఏమిటన్న దానిపైనా చాలా క్లారిటీతో మాట్లాడమే కాకుండా... సదరు వాదనను బలపరిచేలా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

సదరు ఇంటర్వ్యూలో రేవతి చౌదరి ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘నవరత్నాలకు ఆశపడి తప్పు చేశామని ప్రజలే అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక .. ఇసుక కొరత ఏర్పడటం, ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి ప్రజలు మృతి చెందడం తప్ప సాధించిందేమీ లేదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్టణాన్ని ఎన్నుకోవడం వెనుక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాత్ర చాలా ఉంది. అక్కడ భూములన్నీ వాళ్లే కొన్నారు. అసలు, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందే వాళ్ల దగ్గర. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ అవినీతికి పాల్పడిందంటూ డప్పు కొట్టుకుంటూ ఆరోపణలు చేయడం కాదు వాటిని ఆధారాలతో సహా బయటపెట్టాలి. మంత్రులే మూర్ఖులవడం కారణంగా రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన సాగుతోంది. అవినీతి, అక్రమాలు, అరాచకం అనే పదాలను ఉచ్చరించే అర్హత కూడా వైసీపీ నేతలు ఎవ్వరికీ లేదు’ అంటూ రేవతి చౌదరి ఓ రేంజిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.