ఇంత పగా!నిమ్మగడ్డపై కత్తిగట్టిన జగన్‌

August 07, 2020

ఎన్నికల కమిషనర్‌ పదవీకాలం కుదింపు
స్థానిక ఎన్నికల వాయిదా పర్యవసానం
కుదింపు కుదరదన్న హైకోర్టు
ఆయనే కమిషనర్‌ అని స్పష్టీకరణ
జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం కొట్టివేత
అయినా నిమ్మగడ్డ పునర్నియామకానికి జగన్‌ నో
సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌
ఇదేం ఆర్డినెన్స్‌ అని నిలదీసిన సీజేఐ
బిత్తరపోయిన వైసీపీ ప్రభుత్వం

ప్రభుత్వం ఏ పార్టీకి చెందినదైనా ప్రజలందరినీ సమంగా చూడడం విధాయకం. శ్రేయోరాజ్యంలో లబ్ధిదారుల ఎంపికలో, సంక్షేమ ఫలాలు అందించడంతో ఎలాంటి వివక్షా చూపకూడదు. విమర్శ, నిరసన పటిష్ఠ ప్రజాస్వామ్యానికి నిదర్శనాలు. కానీ నవ్యాంధ్రలో పరిపాలన తద్విరుద్ధంగా సాగుతోంది. 151 మంది ఎమ్మెల్యేలు తమకున్నారన్న అహం ప్రభుత్వ పెద్దల నరనరానా జీర్ణించుకుపోయింది.

సీఎం జగన్‌ నుంచి కొందరు ఉన్నతాధికారులు సైతం కక్షపూరిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు. తాము చెప్పినట్లు వినని అధికారులను నయానో భయానో దారికి తెచ్చుకుంటున్నారు. మాట విననివారిని పదవుల నుంచి తొలగించేస్తున్నారు. పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా సతాయిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను తమతో చెప్పకుండా వాయిదావేసినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విషయంలో సీఎం, కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు చూసి హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం విస్తుపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వ అజమాయిషీలో లేని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డను నిమిషాల్లో ఆర్డినెన్స్‌ తెచ్చి..

77 ఏళ్ల వృద్ధుడైన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ను ఆగమేఘాలపై కొత్త కమిషనర్‌గా నియమించడం.. జీవో జారీ అయిన ఐదు నిమిషాల్లోనే ఆయన బాధ్యతలు చేపట్టడం జగన్‌ ప్రభుత్వ మనఃస్థితిని తెలియజేస్తున్నాయి. తనకు ఎదురుతిరిగితే ఎంత పగబడుతుందో నవ్యాంధ్ర కళ్లారా చూస్తోంది.


హైకోర్టు ఏమన్నది..?


నిమ్మగడ్డ 2016 జనవరి 30న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం ఐదేళ్లు అని జీవో 11లో పొందుపరిచారు. అది పూర్తయ్యేదాకా పదవిలో ఉండే అధికారం ఆయనకు ఉంది. దానిని మధ్యలో ఎవరూ లాక్కోలేరు. ఒకవేళ మధ్యలో తొలగించాలంటే...

పదవిలో ఉండి తప్పుగా ప్రవర్తించారనే అభియోగంపై హైకోర్టు జడ్జిని తొలగించేందుకు అనుసరించే ‘అభిశంసన’ ప్రక్రియనే అనుసరించాలి.ఆర్డినెన్స్‌ జారీ చేసి, దాని మేరకు కార్యదర్శి స్థాయి అధికారులు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తప్పించడం కుదరదు’ అని హైకోర్టు ఖండితంగా చెప్పింది.

కమిషనర్‌ పదవీకాలం కుదింపుతోపాటు దానికి అనుగుణంగా జారీ చేసిన జీవోలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఆర్డినెన్స ఇచ్చే అధికారం గవర్నర్‌కు ఉన్నప్పటికీ.. ఈ వ్యవహారంలో జారీ చేసిన ఆర్డినెన్స.. అధికరణ 213లో పేర్కొన్న నిబంధనలను సంతృప్త్తిపరిచేలా లేదని పేర్కొంది.

ఈ పదవికి రాజ్యాంగ రక్షణ ఉందని తేల్చిచెప్పింది. గవర్నర్‌ సంతృప్తి చెందేలా సంబంధంలేని కారణాలతో తప్పుడు ఉద్దేశాలతో అధికారాన్ని వినియోగించినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ‘‘ఇది అధికారాన్ని ఉపయోగించి జారీ చేసిన మోసపూరిత ఆర్డినెన్స్‌. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 నిర్దేశించిన హేతుబద్ధత, సహేతుక పరీక్షకు నిలవదు’ అని ధర్మాసనం పేర్కొంది.


గవర్నర్‌ సంతకం ఏదీ?


నూతన కమిషనర్‌ నియామక ఫైలు కార్యాచరణను ముందు ప్రారంభించి.. ఆపై నిమ్మగడ్డ పదవీకాలం కుదించేందుకు ఫైలు కదపడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ‘ఇప్పటి వరకూ 22 మందిని కేంద్ర చీఫ్‌ ఎలక్షన కమిషనర్లుగా నియమించారు. వారెవరూ 65 ఏళ్లకు పైబడిన వారు కాదు.

ఇప్పుడు 77 ఏళ్ల వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తారా..? ఇది ఎన్నికల సంస్కరణల్లో భాగం కానే కాదు. ఆర్డినెన్స్‌ మేరకు నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిందంటూ ఏప్రిల్‌ 10వ తేదీ రాత్రి 9.45 గంటలకు ఫైలు కదిలించారు.

దానిపై గవర్నర్‌ సంతకం లేకుండానే పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి రాత్రి 10.07 గంటలకు ఆమోదంతో జీవో 618 జారీ చేశానేజ రమేశకుమార్‌ పదవీ కాలాన్ని కుదించేందుకు గల కారణమేదీ ప్రభుత్వం వద్ద లేదు. ఆర్డినెన్స తీసుకురావడానికి, గవర్నర్‌ తక్షణ చర్యలకు సైతం సరైన కారణాలు లేవు.

అకారణంగా, దురుద్దేశంతోనే ఆర్డినెన్స జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణతో ఆర్డినెన్స తీసుకొచ్చి... కొత్త కమిషనర్‌ను నియమించారు. అంతేతప్ప.. ఈ నియామకం అధికరణ 243 కె(1) ద్వారా జరిగినది కాదు’ అని తెగేసిచెప్పింది.


ఏజీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌..


హైకోర్టు తీర్పుతో ఆర్డినెన్స్‌, జీవోలు రద్దు కావడంతో నిమ్మగడ్డే కమిషనర్‌ అని న్యాయనిపుణులు స్పష్టం చేశారు. ఆయన కూడా తాను మళ్లీ బాధ్యతలు తీసుకున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సంఘం ఇన్‌చార్జి కార్యదర్శి ఈ మేరకు అన్ని శాఖలకూ వర్తమానం పంపారు.

ఇది జరిగిన కాసేపటికే ఆ కార్యదర్శిని తొలగించారు. సీనియర్‌ ఐఏఎస్‌ వాణీమోహన్‌ను ఎస్‌ఈసీ కార్యదర్శిగా నియమించారు. ఇదే సమయంలో అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రమణ్యం శ్రీరామ్‌ అసాధారణ రీతిలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆర్డినెన్స్‌ జారీచేసిన పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సీఎంకు సన్నిహితుడైన సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌లను చెరోవైపు కూర్చోబెట్టుకుని.. హైకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెప్పడానికి ప్రయత్నించారు.

2016లో నిమ్మగడ్డ నియామకమే చెల్లదని వాదించారు. ఇదే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను ఈ నెల 10న చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్దంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది.

అసలు ఇలాంటి ఆర్డినెన్స్‌ను ఎలా ఆమోదిస్తారని సీజేఐ బోబ్డే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడొద్దు. ఎన్నికల కమిషనర్‌ను ఆర్డినెన్స్‌తో ఎలా తొలగిస్తారు? ఇది దురుద్దేశంతో కూడిన చర్య. దీని వెనుక ఉన్న ఉద్దేశాలతో మేం సంతృప్తి చెందలేదు’ అని స్పష్టం చేశారు.

నిమ్మగడ్డ సహా ప్రతివాదుల వాదనను పూర్తిగా ఆలకించేందుకు విచారణను రెండు వారాలు వాయిదావేసింది. జగన్‌ ప్రభుత్వం బిత్తరపోయింది. ఏం చేయాలో దానికి అర్థం కావడం లేదు. తొలి చూపులోనే ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసిందని.. వాదనలను ఆమూలాగ్రం విన్నాక తీర్పు దీనికి భిన్నంగా ఉండే అవకాశం లేదని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు.


ఎందుకింత కక్ష?


నిమ్మగడ్డ మళ్లీ ఆ కుర్చీలో కూర్చోకూడదని జగన్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. స్థానిక ఎన్నికల వాయిదా ఒక్కటే దీనికి కారణం కాదు. నిమ్మగడ్డ, చంద్రబాబు ఒకే సామాజిక వర్గం వారని.. చంద్రబాబే ఆయన్ను నియమించారని..

అందుకే చంద్రబాబుకు ఆయన సహకరిస్తున్నారని కులం పేరుపెట్టి మరీ జగన్‌ విలేకరుల సమావేశంలో విమర్శలు గుప్పించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఒక సీఎం ఇలా కులవివక్షతో మాట్లాడడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆయన బాటలోనే సభాపతి తమ్మినేని సీతారాం నుంచి వైసీపీ నేతలంతా తీవ్ర ఆరోపణలు చేశారు.

దీంతో ఆందోళనకు గురైన నిమ్మగడ్డ తన ప్రాణాలకు ముప్పుందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. హోంశాఖ తక్షణమే స్పందించి సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో ఆయనకు భద్రత కల్పించింది. అదే లేఖలో స్థానిక ఎనన్నికల్లో అధికార పార్టీ అక్రమాలను ఆయన వివరించారు.

వారికి కొందరు అధికారులు సైతం ఏ విధంగగా సమర్థించిందీ తెలియజేశారు. ఇది జగన్‌కు కోపకారణమైందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను ఆ పదవిలో కొనసాగనివ్వకూడదని కంకణం కట్టుకున్నారని చెబుతున్నాయి.