విశాఖపై పగ -తల్లిని ఓడించినందుకు కక్ష

August 07, 2020

విశాఖపై పగ
తల్లిని ఓడించినందుకు కక్ష
బాక్సైట్‌ తవ్వకాలకు అడ్డుపడ్డందుకే
ఆ నగరానికి జగన్‌ ‘రాజధాని’ శిక్ష
‘బినామీ’ రస్‌-అల్‌-ఖైమా పోయిందని కోపం
రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు ముందే నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రాజధాని అమరావతి రైతులకు దానిని మార్చబోనని పలు సభల్లో ఆయన హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారు. మడమ తిప్పారు. వాస్తవానికి విశాఖపై ప్రేమతో ఆయన సచివాలయాన్ని తరలించాలనుకోవడం లేదు. అక్కడి ప్రజలపై పగబట్టి ఈ పనిచేస్తున్నారు. ఎందుకు పగబట్టారంటే.. 2014 ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి ఆయన తల్లి వైఎస్‌ విజయలక్ష్మి పోటీచేసి ఘోరంగా ఓటమిపాలయ్యారు. వైఎస్‌ కుటుంబం నుంచి ఇంతవరకు ఎవరూ పరాజయం పాలుకాలేదు. విశాఖ వాసులు తన తల్లిని ఓడించడంతో ఆయన కుపితుడయ్యారు. విశాఖపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన జైలులో ఉన్నప్పుడు 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తన విజయం ఖాయమని.. సీఎం అయిపోతున్నానని ఆయన ప్రకటించుకున్నారు. కానీ కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఆయనకు లేదన్న ఉద్దేశంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబును ప్రజలు ఎంచుకున్నారు. విశాఖలో బీజేపీ-టీడీపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబును ప్రజలు గెలిపించారు. ఆ ఎన్నికలకు ముందే పులివెందుల ముఠాలు రంగప్రవేశం చేసి దౌర్జన్యాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రజలు భయపడిపోయారు. వైసీపీ గెలిస్తే ప్రశాంత నగరంలో అశాంతి రేపుతారని వణికిపోయారు. తల్లిని ఓడించినందుకు జగన్‌ కక్షబూనారు. హుద్‌హుద్‌ తుఫాను వచ్చి.. నగరం కకావికలమైనప్పుడు.. ఆయన పరామర్శకు వచ్చి నానా యాగీ చేశారు. ప్రజలకు అందే సాయం అందకుండా చేశారు. నోటదగ్గర ముద్ద లాగేశారు. అటు తర్వాత తన సేవకులను రంగంలోకి దించారు. విజయలక్ష్మిని ఓడించబట్టే విశాఖ తుఫానుకు సర్వనాశనమైందని శాపనార్థాలు పెట్టించారు. మరో కారణం.. బాక్సైట్‌ తవ్వకాలను చంద్రబాబు నిషేధించడం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మన్యం ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిచ్చారు. జిందాల్‌ గ్రూపు రంగంలోకి వచ్చినా గిరిజనుల్లో వ్యతిరేకత, మావోయిస్టుల కన్నెర్ర కారణంగా కొన్నాళ్లు ముందుకు కదల్లేదు. ఆ తరుణంలో జగన్‌ బినామీలు యూఏఈకి చెందిన రస్‌-అల్‌-ఖైమాను తెరపైకి తెచ్చారు. అన్‌రాక్‌ అల్యూమినియం కంపెనీకి వేల హెక్టార్లలో తవ్వకాలకు అవకాశమిచ్చారు. ఈ అనుమతులను చంద్రబాబు 2015లో రద్దుచేశారు. అన్‌రాక్‌పై కాంగ్రెస్‌ హయాంలోనే కేసులు నమోదయ్యాయి. తన బినామీలను  దెబ్బతీసిన గిరిజనులపైనా ఆయన పగబట్టారు. విశాఖలో రాజధాని పెడితే.. అభివృద్ధి పేరిట మళ్లీ బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సరేసరి. విశాఖను దోచుకోవడానికి విజయసాయిరెడ్డి గత ఆరునెలలుగా అక్కడే మకాం వేశారు.
ముందస్తు వ్యూహం
విశాఖలో రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూములు, భవంతుల సేకరణకు ఆ జిల్లా అధికారుల నుంచే పూర్తి సమాచారం ప్రభుత్వానికి చేరింది. అయితే రాజధాని కోసమని చెప్పకుండా ‘బిల్డ్‌ ఏపీ’ పేరుతో కొంత సమాచారం, గృహ నిర్మాణానికి భూములు అవసరమని మరికొంత సమాచారం సేకరించారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున జగన్‌  విశాఖలో కార్య నిర్వాహక రాజధాని పెట్టాలనే ఉందని సభలో చెప్పడం.. జీఎన్‌ రావు కమిటీ కూడా అదే రీతిలో నివేదిక ఉండడం తెలిసిందే. విశాఖలో ఎక్కడెక్కడ ఏమేమి గుర్తించారో...ఇప్పుడు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. విశాఖపట్నం-భీమిలి బీచ్‌రోడ్డులో రుషికొండ ఉంది. అక్కడి ఐటీ పార్కులో గత ప్రభుత్వం నిర్మించిన మిలీనియం టవర్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. ఆ భవనాన్ని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.145 కోట్లతో నిర్మించారు. పది అంతస్థులతో, అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ భవనంలో రెండు లక్షల చదరపు అడుగుల స్పేస్‌ ఉంది.  మరో 1.5 లక్షల చ.అ. పార్కింగ్‌ సదుపాయం ఉంది. దీన్ని ఐటీ సంస్థల కోసమని నిర్మించారు. విదేశీ ఐటీ కంపెనీ కాండ్యుయెంట్‌కు ఆ భవనాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారు. ప్రస్తుతం అందులో 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీని ఖాళీ చేయించి, అందులో సీఎం క్యాంపు కార్యాలయం పెడతారట! దీనిని మిలీనియం టవర్‌-1గా వ్యవహరిస్తున్నారు. దీని పక్కనే టవర్‌-2 పేరుతో మరో భవనాన్ని రూ.80 కోట్లతో నిర్మిస్తున్నారు. అందులో ఇంకో లక్ష చదరపు అడుగుల నిర్మాణ స్థలం అందుబాటులోకి వస్తుంది. మిలీనియం టవర్‌కు ముందు అదే వరుసలో నాలుగేళ్ల క్రితం స్టార్టప్‌ విలేజ్‌ కోసం ఒక భవనాన్ని రూ.70 కోట్లతో నిర్మించారు. అందులో 50 వేల చ.అ. విస్తీర్ణం గల నిర్మాణ స్థలం ఉంది. ఇక్కడున్న స్టార్టప్‌ కంపెనీలు అన్నింటిని మూడు నెలల క్రితమే ఖాళీ చేసి పంపించేశారు. ప్రస్తుతం రెండు కంపెనీలు ఉన్నాయి. దాదాపు ఈ భవనం కూడా ఖాళీయే. ఈ భవనాలన్ని రుషికొండ ఐటీ పార్కు హిల్‌ నంబరు 3లో ఉన్నాయి. ఇదే కొండపై రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు కెనెక్సా అనే కంపెనీకి 25 ఎకరాల భూమి కేటాయించారు. అందులో నాలుగు ఎకరాలు మాత్రమే వారు ఉపయోగించుకున్నారు. మిగిలిన 20 ఎకరాలు వెనక్కి ఇచ్చేశారు. అది కూడా ఖాళీగానే ఉంది. హిల్‌ నంబరు 2లో పలు ఐటీ కంపెనీలకు స్థలాలు కేటాయించగా, వాటిలో కొన్ని ఇప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదు. వాటిని వెనక్కి తీసుకునే ఆలోచన ఉందంటున్నారు. ఇదే కొండపై బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుకు రెండు ఎకరాల స్థలంలో ఒక ఐటీ కంపెనీ ఉంది. అందులో 70 వేల చ.అ. నిర్మాణ స్థలం ఖాళీగా ఉంది. అవసరమైతే దానిని కూడా అద్దెకు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఐటీ పార్కుకు సమీపానే వీఎంఆర్‌డీఏకు చెందిన 20 ఎకరాల స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి బాగా దగ్గర. అక్కడ ఐటీ సిటీ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. అవసరమైతే ఆ భూమిలో కూడా ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలు నిర్మించుకోవచ్చు. ఈ ప్రాంతానికి సమీపంలోనే కాపులుప్పాడ అనే గ్రామం ఉంది. అక్కడ యునిటెక్‌ అనే కంపెనీకి కాంగ్రెస్‌ హయాంలో 1,350 ఎకరాలు కేటాయించారు. సదరు కంపెనీ చేతులెత్తేయడంతో దానిని ఆ తరువాత వెనక్కి తీసుకున్నారు. అందులో 450 ఎకరాలను గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసి అదానీ కంపెనీకి 175 ఎకరాలు కేటాయించారు. కొండ మీదకు రహదారి నిర్మించారు. ఇప్పుడు ఆ భూములన్నీ ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు.
ప్రభుత్వం మాది.. సీఎం మావాడు
ఇప్పటికే పులివెందుల ముఠాలు విశాఖలో దిగిపోయాయి. కోట్ల రూపాయల విలువైన భూ వివాదాలను గుర్తించి, సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని పార్టీలను బెదిరిస్తున్నాయి. సీఎం మావాడని, ప్రభుత్వం తమదని, చెప్పినట్లు వినకపోతే మీ భూములు మీకు ఉండవని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గాజువాకలో తాజాగా రెండు భూ వివాదాలను ఓ ముఠా సెటిల్‌మెంట్‌ చేసిందని విశ్వసనీయ సమాచారం. విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో పర్యాటక ప్రాజెక్ట్‌కు సంబంధించి కొంతమొత్తం వసూలు చేసినట్లు తెలిసింది. తాజాగా సింబయోసిస్‌ టెక్నాలజీస్‌ సీఈవో ఓరుగంటి నరేశ్‌కుమార్‌ ఇంటికెళ్లి... ఓ భూవివాదం సెటిల్‌మెంట్‌కు ముఠా సభ్యులు ఒత్తిడి చేశారు. నరేశ్‌కుమార్‌ బావ కాట్రగడ్డ లలితేశ్‌ చాలాఏళ్ల క్రితం నగరంలోని మర్రిపాలెంలో ఆరెకరాల యూఎల్‌సీ మిగులు భూమి కొన్నారు. ప్రస్తుతం దాని విలువ రూ.100 కోట్లపైనే ఉంటుంది. ఆ భూమిని ఆనుకుని 200 గజాల్లో ఓ ఆక్రమణదారు కుటుంబానికి కూడా నష్టపరిహారం చెల్లించారు. ఈ వివాదం న్యాయస్థానం వరకు వెళ్లడంతో అక్కడ నరేశ్‌కుమార్‌ కుటుంబానికి అనుకూలంగా తీర్పువచ్చింది. ఆ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పదేళ్లుగా ఆ భూమి నరేశ్‌కుమార్‌ స్వాధీనంలోనే ఉంది. ఈ వివాదం నడుస్తుండగానే 2013లో హైదరాబాద్‌కు చెందిన బాలకృష్ణ మోహన్‌ అనే వ్యక్తి అవతల పార్టీతో జీపీఏ రాయించుకొని మరో రిట్‌ పిటిషన్‌ వేశారు. గత ఆదివారం పులివెందుల బృందం నరేశ్‌కుమార్‌ ఇంటికి వచ్చింది. ఒక్కరే వస్తారని చెప్పి.. ఐదుగురు రావడంతో ఆయన అవాక్కయ్యారు. ఆ భూమిని తమకు అమ్మడానికి 16 మంది ముందుకు వచ్చారంటూ డాక్యుమెంట్లు, జీవోలతో ఓ బౌండ్‌ బుక్‌ ఆయనకు చూపించారు. ఆ వివాదం గురించి మాట్లాడాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేయడంతో ‘అలాగైతే ఆ భూమి మీకు దక్కదు. ప్రభుత్వానికి వెళ్లిపోతుంది’ అని బెదిరించారు. నరేశ్‌కుమార్‌ కాస్త తెగువ చూపి.. ‘మీరు సీఎం పేరు చెప్పి బెదిరిస్తే, ఢిల్లీలో అమిత్‌షా దగ్గరకి వెళతాం’ అని చెప్పడంతో మేఠా వెళ్లిపోయింది. ఈ ముఠాలోనివారు పులివెందులకు చెందిన బాలనారాయణరెడ్డి(రిమ్స్‌ నిర్వహణ కాంట్రాక్టర్‌), వేల్పుల రాము/ లింగాల రామలింగారెడ్డి అని సీసీకెమెరా ఫుటేజీలో తెలిసిపోయింది. ఈ ఉదంతం తర్వాత ప్రజల్లో భయం మరింత పెరిగింది. సచివాలయం ఇక్కడకు తరలివస్తే తమ ఆస్తులకు రక్షణ ఉండదని వారు ఆందోళన చెందుతున్నారు. 

Read Also

వివేకా కేసు : జగన్ కి ఊహించని షాకిచ్చిన టీడీపీ 
పోలవరంపై నారా లోకేష్‌కు అడ్డంగా దొరికిపోయిన జగన్
ఎయిర్ పోర్టులో తళుక్కుమన్న వైఎస్ షర్మిల