టెండర్లు ‘రివర్స్‌’!

May 28, 2020

భారీ మైనస్‌లకు వెళ్తున్న సంస్థలు
వాటికే కాంట్రాక్టులు ఇస్తున్న ప్రభుత్వం
ఆ తర్వాత అంచనాల సవరణకు ఆమోదం
నాణ్యతపై వెల్లువెత్తుతున్న అనుమానాలు
ఈపీసీ విధానమే మేలంటున్న నిపుణులు


రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అవినీతి, అక్రమాల ఆరోపణలతో జగన్‌ ప్రభుత్వం కాంట్రాక్టులన్నీ రద్దుచేసేసి.. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తోంది. అదేవిధంగా కొత్తగా చేపట్టిన పథకాలకూ ఇదే విధానం అవలంబిస్తోంది. ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్లు కలిగిన శాఖలు బోర్డ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇంజనీర్స్‌తో సమీక్షలు నిర్వహించి.. రివర్స్‌ టెండరింగ్‌ మార్గదర్శకాలు రూపొందించి.. ఉత్తర్వులూ జారీ చేశాయి. పోలవరం ప్రాజెక్టు, జల విద్యుత్కేంద్రాన్ని కలిపి ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండర్‌కు వెళ్లేందుకు ఒక్క రోజు ముందే.. అంటే గత  ఏడాది ఆగస్టు 16వ తేదీన జీవోఎంస్‌-67 నంబరుతో జల వనరుల శాఖ ఉత్తర్వు జారీ చేసింది. ఈ మేరకే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లామని.. పోలవరం సాగు నీటి ప్రాజెక్టూ.. జల విద్యుత్కేంద్రంలోనూ 12.6 శాతానికి కాంట్రాక్టు సంస్థ తక్కువకు కోట్‌ చేయడంతో రూ.628 కోట్ల మేర ఆదా అయిందని.. ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పనులకూ రివర్స్‌ టెండర్‌కు వెళ్లడంతో రూ.58 కోట్ల వరకూ ఆదా అయిందని ప్రభుత్వం చెబుతోంది. వెలిగొండ టన్నెల్‌కు రివర్స్‌ టెండరింగ్‌లో  కూడా రూ.62 కోట్ల మేర లబ్ధి చేకూరుందని అంటోంది. ఇలా ప్రాజెక్టులన్నిటికీ రివర్స్‌ టెండరింగ్‌ అమలు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ మొత్తంలో ఆదా అవుతోందని.. చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనేందుకు ఇదే ప్రబల నిదర్శనమని వాదిస్తోంది. కేవలం సాగు నీటి ప్రాజెక్టులకే కాకుండా పది కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక లావాదేవీలు జరిగే ప్రతి పనిలోనూ రివర్స్‌ టెండరింగ్‌ విధానానికే వెళ్తామని ప్రకటించింది. బోర్ల తవ్వకాల కోసం రిగ్‌ల కొనుగోలులోనూ .. గ్రామ వాలంటీర్లకూ .. గ్రామ సచివాలయ ఉద్యోగులకూ స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలులోనూ ఇదే పాటిస్తున్నామని.. భారీగా ఖర్చును తగ్గించడంతోపాటు ఖజానాపై పడే భారాన్ని తగ్గిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటోంది. కానీ నిపుణులు ఈ ఆదాపై సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
రాజకీయ జోక్యం లేకుండా సాధ్యమా?
రాజకీయ జోక్యం లేకుండా రివర్స్‌ టెండరింగ్‌ సాధ్యమవుతుందా అనేది ప్రధాన ప్రశ్న. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందని.. ఇనీషియల్‌ బెంచ మార్క్‌ (ఐబీఎం)ను పెంచేశారని.. దానిపైనా నాలుగైదు శాతం పెంచేసి తమకు అనుకూలమైన కాంట్రాక్టు సంస్థలకు ప్రాజెక్టు నిర్మాణ పనులు అప్పగించేశారని ప్రతిపక్షంలో ఉండగా.. ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అనునిత్యం ఆరోణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక.. రూ.100 కోట్లు దాటే ఏ పనికైనా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామని.. ఏయే పనులకు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామో.. ఎంత మొత్తానికి ఐబీఎంను ఖరారు చేశామో .. ముందుగానే ప్రజలకు తెలిసేలా పారదర్శకంగా శాఖల వారీ వెబ్‌సైట్‌లలో ప్రదర్శిస్తామని ప్రకటించారు. ఈ టెండర్‌ డాక్యుమెంట్ల పరిశీలనకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకరరావు సారథ్యంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. అంతా పారదర్శకంగానే ఉంటుందని.. ఎవరడిగినా టెండరు డాక్యుమెంట్లను అందజేస్తామని కూడా స్పష్టం చేశారు. చీఫ్‌ ఇంజనీర్ల బోర్డు అధ్యయనం చేసి రూపొందించిన జీవో 67లో పొందుపరచిన నిబంధనల మేరకు.. రివర్స్‌ టెండరింగ్‌ విధానమంతా.. ఆనలైనలోనే జరగాలి. అందులో పాల్గొనే కాంట్రాక్టు సంస్థలు, వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచాలి. ఈ సంస్థలూ, వ్యక్తులకూ ముసుగేసేలా ఒక కోడ్‌ పేరు పెట్టాలి. ఈ కోడ్‌ ఎవరిదో కూడా బహిర్గతం కాకూడదు. వాస్తవాన్ని పరిశీలిస్తే ఈ బిడ్లు ఎవరెవరు వేస్తున్నారో బహిర్గతమైపోతోందని నిపుణులు అంటున్నారు. కాగా.. జాతీయ స్థాయిలో ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానం అమలులో ఉంటే.. రివర్స్‌ టెండరింగ్‌ ఎందుకని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ టెండర్‌ విధానంలో.. టెండర్‌ బాక్సులో బిడ్లు దాఖలు చేసేవారు. కాంట్రాక్టు సంస్థలూ, వ్యక్తులూ తమ టెండర్‌ డాక్యుమెంట్లను సీల్డ్‌ కవర్‌లో వేసేవారు. ఈ బిడ్లు తెరిచేవరకు ఎవరు ఎంతెంతకు కోట్‌ చేశారో తెలిసేది కాదు. ఎల్‌-1గా వచ్చిన వ్యక్తికి లేదా సంస్థకు పనులు అప్పగించేవారు. అయితే.. ఈ బాక్సు విధానంలో రాజకీయం జోక్యం అధికంగా ఉండేది. నిర్మాణ సంస్థ లేదా వ్యక్తులు తప్పనిసరిగా సంబంధిత కార్యాలయాల వద్ద ఉంచిన బాక్సుల్లో వ్యక్తిగతంగా వెళ్లి బిడ్లు దాఖలు చేయాల్సి వచ్చేది. అయితే.. ఈ టెండర్‌ను దక్కించుకోవాలనుకునే బలమైన సంస్థలు.. బలహీనులపై బలప్రయోగం చేసేవారు. దీంతో ఒకే ఒక్క టెండర్‌ బిడ్‌ పడేది. లేకపోతే.. తన అనుచరులతో డమ్మీ టెండర్లు వేయించేవారు. అంతేకాకుండా సిండికేట్‌ అయ్యేవారు. దీంతో బలమున్నవాడికే టెండర్‌ దక్కేది. దీనిని నివారించేందుకు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానం తీసుకొచ్చారు. ఇది వచ్చాక .. దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడ నుంచైనా ఈ-టెండర్‌ విధానం బిడ్లు  దాఖలు చేసే అవకాశం వచ్చింది. దీంతో రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా టెండర్‌ బిడ్‌లను దాఖలు చేసే అవకాశం లభించింది. ఫలితంగా కాంట్రాక్టు పనుల విలువ కంటే భారీగా టెండర్‌ కోట్‌ చేయడం గానీ .. అతి పోటీకి పోయి మరీ తక్కువకు కోట్‌ చేయడం గానీ లేకుండా నిర్భీతిగా బిడ్లు వేసే అవకాశం దక్కింది. ఇలాంటి అవకాశం ఉండగా.. మళ్లీ స్విస్‌ చాలెంజ్‌ తరహాలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాల్సిన అవసరమేముందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఐబీఎం నిర్ధారణలో మతలబు
రాష్ట్రంలో రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో వెళ్తున్న ప్రాజెక్టులకు ఖరారు చేస్తున్న ఇనీషియల్‌ బెంచ మార్క్‌ (ఐబీఎం)పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జీవో 67లో పేర్కొన్న ఐబీఎం విధానాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. రివర్స్‌ టెండర్‌ విధానానికి వెళ్లాలంటే.. అప్పటికే నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాంట్రాక్టును రద్దు చేసుకోవాలంటే.. ఏదైనా మార్గదర్శకాలను అతిక్రమించారేమో చూడాలి. ఏ కొద్ది అతిక్రమణ లేదా జాప్యం జరిగినా కాంట్రాక్టును రద్దు  చేసుకోవాలని జీవో పేర్కొంది. అంటే .. రివర్స్‌ టెండర్‌కు వెళ్లాలనుకుంటే  ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఆ తర్వాత గతంలో చేసుకున్న కాంట్రాక్టు ఒప్పందం విలువలోంచి.. అప్పటి వరకూ పూర్తి చేసిన పని విలువను తీసేయాలి. గత ఒప్పందం మేరకు ఇంకా చేయాల్సిన పనికి పాత ధరనే ఐబీఎంగా తీసుకోవాలి. ఈ ధరకే రివర్స్‌ టెండర్‌కు వెళ్లాలి. ఈ నిబంధనను నిపుణులు తప్పుబడుతున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టు సంస్థను మార్చి తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టు పనులు కట్టబెట్టడమే ప్రధానోద్దేశంగా ‘రివర్స్‌ టెండరింగ్‌ ’ జరుగుతోందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టులోనూ.. జల విద్యుత్కేంద్రంలోనూ జరిగింది ఇదే. 2010-11 అంచనాల మేరకు పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.16,010.45 కోట్లుగా లెక్కించారు. దానిలోనే హెడ్‌వర్క్స్‌ పనులూ ఉన్నాయి. ఈ మొత్తంలో .. జల వనరుల శాఖ అంచనా వేసిన ఇనీషియల్‌ బెంచ మార్క్‌ (ఐబీఎం) కంటే 14.555 శాతం తక్కువకు ట్రానసా్ట్రయ్‌ పనులు దక్కించుకుంది. తర్వాత  2015-16లో అంచనాలు సవరించారు. వాటిలోనూ 14.555 శాతం తక్కువ ఉండేలా కాంట్రాక్టు సంస్థతో జల వనరుల శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ మొత్తం పెంచడాన్ని ప్రతిపక్షనేతగా వైఎస్‌ జగన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంచనాలు పెంచేసి అస్మదీయులకు కాంట్రాక్టును కట్టబెట్టి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఆయనొచ్చాక.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఇంకా మిగిలిపోయిన రూ.1,771 కోట్ల హెడ్‌ వర్క్స్‌ పనులకూ, రూ.3,216 కోట్ల జల విద్యుత్కేంద్రం పనులకు మొత్తం రూ.4,987 కోట్లను ఒకే ప్యాకేజీగా చేసి రివర్స్‌ టెండర్‌కు వెళ్లారు. ఈ మొత్తంలో రూ.4359 కోట్లకు అంటే రూ.628 కోట్ల తక్కువకు మేఘా ఇంజనీరింగ్‌ బిడ్‌ దాఖలు చేసింది. ఒకే ఒక్క సంస్థ బిడ్‌ను వేయడంతో.. దీనిని రీ-టెండర్‌గా పరిగణనలోకి తీసుకున్నారు. కొద్ది రోజులకే.. రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం మేరకు టన్నుకు రూ.375 చెల్లించాల్సి ఉందని.. ఈ విలువను సవరించాలని మేఘా సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. దీనికి  ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ సవరణ వల్ల రూ.500 కోట్లు భారం పడనుందని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా  జీఎస్‌టీ సహా.. టెండర్‌ డాక్యుమెంట్‌లో లేని పనులు చేపట్టేందుకూ అదనంగా చెల్లించాల్సి ఉంటుందని.. ఈ మొత్తాలను కలిపితే.. రీటెండర్‌లో ప్రభుత్వానికి అదనంగా కలిగే ఆర్థిక ప్రయోజనం పెద్దగా లేదని వారంటున్నారు. వెలిగొండ, ఇతర ప్రాజెక్టుల్లోనూ ఇదే జరుగుతోందని తప్పుబడుతున్నారు.

RELATED ARTICLES

  • No related artciles found