ఆర్జీవీ బ‌యోపిక్ మొద‌లైంది

August 12, 2020

ఇది ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజం. రామ్ గోపాల్ వ‌ర్మ మీద బ‌యోపిక్ రాబోతోంది. ఐతే ఇది ఆయ‌న్ని గొప్ప‌గాచూపించే స్ఫూర్తిదాయ‌క చిత్రం కాదు. ఆయ‌న మీద సెటైరిక‌ల్‌గా తీస్తున్న సినిమా. దీనికి పూనుకున్న‌ది సీనియ‌ర్ ర‌చ‌యిత‌, గేయ ర‌చ‌యిత‌, క‌వి జొన్న‌విత్తుల రామ‌లింగేశ్వ‌ర‌రావు కావ‌డం విశేషం. ఈ మ‌ధ్య వ‌ర్మ‌కు ఆయ‌న‌కు మ‌ధ్య టీవీ చ‌ర్చ‌ల్లో పెద్ద గొడ‌వ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు లాంటి వివాదాస్ప‌ద సినిమా తీసి స‌మాజానికి ఏం సందేశం ఇవ్వాల‌నుకుంటున్నారంటూ జొన్న‌విత్తుల వ‌ర్మ‌పై విరుచుకుప‌డ్డారు. వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా ఎలా ప‌త‌న‌మ‌య్యాడో వివ‌రిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఐతే వ‌ర్మ ఆయ‌న‌కు త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చాడు. ఆయ‌న‌కు కులం అంట‌గ‌ట్టి వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. 

క‌ట్ చేస్తే ఇప్పుడు వ‌ర్మ మీద జొన్న‌విత్తుల సినిమాకు స‌న్నాహాలు చేయ‌డం విశేషం. ఆర్జీవీ పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి కథ‌, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే  సమకూర్చ‌డంతో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ది జొన్నవిత్తులనే కావ‌డం విశేషం. తాను తీస్తున్న సినిమా గురించి జొన్నవిత్తుల మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో లో కొందరు వ్యక్తులు స్వేచ్ఛ పేరుతో యువతను తప్పుదోవ పట్టించే భావజాలాన్ని ఒక సిద్ధాంతంలా ఎక్కించడం వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని ఒక ఆసక్తికరమైన చిత్రంగా తెరకెక్కిస్తున్నానని, ఈ చిత్రం పిచ్చెక్కించే వినోదంతో పాటు అటువంటి వాళ్లకు పిచ్చి తగ్గించే ఔషధం అవుతుందని అన్నారు. ఆయ‌న వ్యాఖ్య‌లు వ‌ర్మ‌ను ఉద్దేశించే అన‌డంలో సందేహం లేదు. మ‌రి ఈ సినిమా విష‌య‌మై వ‌ర్మ ఏమంటాడో చూడాలి.