హీరోయిన్‌తో స్టేజ్ మీద వ‌ర్మ స్టెప్పులేస్తే..

May 26, 2020

రామ్ గోపాల్ వ‌ర్మ ఒక‌ప్పుడు గొప్ప ద‌ర్శ‌కుడు. ఇప్పుడు గొప్ప మాట‌కారి మాత్ర‌మే. ఐతే ఇప్పుడాయ‌న త‌న‌లోని కొత్త టాలెంట్ చూపించాడు. అది ఇంత‌కుముందు ఎవ‌రూ, ఎప్పుడూ చూడ‌నిది. ఆర్జీవీ తొలిసారిగా ఒక స్టేజ్ మీద డ్యాన్స్ చేశాడు. డ్యాన్స్ అంటే నామ‌మాత్రంగా అలా న‌డుము ఊపి వెళ్లిపోయే త‌ర‌హాలో కాదు. ఒక నిమిషం పైగా వ‌ర్మ నృత్యం చేశాడు. బాగా డ్యాన్స్ తెలిసిన వాడిలాగా స్టెప్పులు వేసి చూపించాడు. ఒక స్టెప్పులో వ‌ర్మ ఊపు చూస్తే ఎవ్వ‌రైనా షాక‌వ్వాల్సిందే. ఇంత‌కీ ఇదంతా ఎక్క‌డ జ‌రిగిందంటారా? త‌న శిష్యుడు అగ‌స్త్య మంజు ద‌ర్శ‌కత్వంలో వ‌ర్మ నిర్మించిన బ్యూటిఫుల్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో.
ఈ ఈవెంట్లో చిత్ర క‌థానాయిక నైనా గంగూలీతో క‌లిసి వ‌ర్మ డ్యాన్స్ చేయ‌డం విశేషం. ఎప్పుడూ స్టేజ్‌ల మీద‌ మాట‌ల‌తోనే మ్యాజిక్ చేసే వ‌ర్మ ఇలా డ్యాన్స్ చేయ‌డం విశేష‌మే. త‌న క్లాసిక్ మూవీ రంగీలాకు ట్రిబ్యూట్‌గా వ‌ర్మ చెప్పుకుంటున్న బ్యూటిఫుల్ సినిమా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేకెత్తించ‌డంలో విఫ‌ల‌మైంది. హీరోయిన్ అందాల్ని ఎలివేట్ చేస్తూ.. విప‌రీతంగా ఎక్స్‌పోజింగ్ చేయిస్తూ రిలీజ్ చేసిన ప్రోమోలేవీ కూడా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించ‌లేక‌పోయాయి. తాజాగా రెండో ట్రైల‌ర్ కూడా వ‌దిలినా ఫ‌లితం లేక‌పోయింది. జ‌న‌వ‌రి 1న సినిమా రిలీజ్ చేయాల్సి ఉండ‌గా.. ట్రేడ్ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. దీంతో సినిమాకు ప‌బ్లిసిటీ తేవ‌డం కోసం వ‌ర్మ ఈ డ్యాన్స్ ఎత్తుగ‌డ ఎంచుకున్నాడో ఏమో. అయినా సినిమా ప‌రిస్థితేమీ మారేలా క‌నిపించ‌డం లేదు.