వర్మ సెటైర్...సీరియస్ ట్వీట్స్ ...వైరల్

August 07, 2020

రామ్ గోపాల్ వర్మ అలియాస్ రామూ....టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో చాలామందికి సుపరిచితుడు...కొంతమందికి అపరిచితుడు అయిన విలక్షణ కమ్ వివాదాస్పద దర్శకుడు. సినిమా...సెక్స్....రాజకీయాలు.....ఇలా తనకు నచ్చిన టాపిక్ పై తనదైన మార్క్ ట్వీట్స్ సెటైర్లతో సోషల్ మీడియాలో రామూ హల్ చల్ చేస్తుంటాడు.  ఈ మధ్య కరోనాపై వరుస సెటైరికల్ ట్వీట్స్ తో వర్మ  ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. ఓ పక్క కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని టాలీవుడ్ సెలబ్రిటీలు చెబుతుంటే....అందుకు భిన్నంగా వర్మ మాత్రం కరోనాకే క్లాసులు పీకుతున్నాడు. తాజాగా కరోనాపై మరో ట్వీట్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. కరోనా విలన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంటే...సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎక్కడకు వెళ్లారని వర్మ సెటైర్ వేశాడు. కరోనా దెబ్బకు  భయపడి వారంతా వేరే గ్రహాలకు పారిపోయారని చెప్పకండంటూ వర్మ తన మార్క్ పంచ్ వేశాడు. 

ఓ వైపు కరోనాపై సెటైరికల్ ట్వీట్స్ చేసిన వర్మ....మరో వైపు దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుకకు ఆర్థిక సహాయం అందించాలంటూ సీరియస్ ట్వీట్ చేశాడు. రేణుకు ఆడపిల్ల పుట్టిందని, తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని వర్మ ట్వీట్ చేశాడు. అయితే `రేపిస్టు` ముద్ర ఆ తల్లీ కూతుళ్ల భవిష్యత్తుపై పడకుండా ఉండాలంటే.. దయచేసి ఎవరికి తోచిన సాయం వారు చేయాలంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. `యాక్షన్‌ ఎయిడ్‌ ఫర్‌ సోసైటల్‌ అడ్వాన్స్‌మెంట్‌`(ఏఏఎస్‌ఏ) అకౌంట్‌ నంబరుకు తోచినంత విరాళం అందించి ఆ తల్లీకూతుళ్ల బంగారు భవిష్యత్తు కోసం సాయం చేయాలని వర్మ పిలుపునిచ్చాడు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగే నాటికి చెన్నకేశవులు భార్య రేణుక గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. దిశ ఘటనపై తాను సినిమా తీస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేణుకతోపాటు, పలు వురు పోలీసు అధికారులతోనూ వర్మ భేటీ అయ్యాడు. ఆ సందర్భంలో రేణుకకు స్వయంగా వర్మ ఆర్థిక సాయం ప్రకటించి...మిగతా వారు ఆర్థిక సాయం చేయాలని పిలుపునిచ్చిన  సంగతి తెలిసిందే.