నేను అదో టైపు.. పడక గది విషయాలు నాకొద్దు వర్మ సంచలనం

July 10, 2020

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అదో సంచలనమే అవుతుంది. కేవలం వివాదం అనే కాన్సెప్ట్ నే కేంద్రబిందువుగా తీసుకోవడం బహుశా ఆయన సీక్రెట్ ఆఫ్ సక్సెస్ కావొచ్చు. ఎప్పుడూ పలు వివాదాలతో వార్తల్లో నిలిచే వర్మ.. సరిగ్గా ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ జీవిత కథ లక్ష్మీస్ ఎన్టీఆర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి చాలా సంచలనాలే సృష్టించారు. పైగా ఎన్టీఆర్ జీవితంపై ఎవరెన్ని సినిమాలు తీసినా నాదే నిజమైన కథ అని చెప్పాడు వర్మ. అయితే ఈ సినిమా విడుదలయ్యాక అనుకున్న పాపులారిటీ మాత్రం సంపాదించలేకపోయింది.

కాగా తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన వర్మ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ``నా దృష్టిలో పడక గది సంబంధాలకు అంతగా విలువ ఇవ్వను. వాటికి పెద్దగా ప్రాధాన్యం ఉండదని అనుకొంటాను. కానీ మనుషులతో బంధాలకు ప్రాధాన్యం ఇస్తాను. ఓ వ్యక్తి నాకు ఎలాంటి సంతోషం కలిగిస్తాడు అన్నదానిని బట్టి రిలేషన్స్ ని డీల్ చేస్తాను. వర్మకు పిచ్చి.. మెంటల్.. పర్వర్టెడ్ అని ఓ వర్గం వారు అనుకొంటారు. ఆర్జీవి ఇంటెలిజెంట్.. జీనియస్.. ఇంటెలెక్చువల్ అని మరో వర్గం అనుకొంటారు. కానీ ఎవ్వరికీ నేనంటే ఏమిటో తెలియదు. నేను అదో టైపు అంతే. అదేంటో నాక్కూడా తెలీదు. ఇంటిలిజెంట్, మెంటల్ అనే విషయాలకు మధ్య చాలా తేడా ఉంది. పచ్చ కామెర్ల వ్యాధి ఉన్న వాళ్లకు లోకమంత పచ్చగానే ఉంటుంది అంటారు. ఎవరూ ఏ కోణంలో చూస్తే వారికి నేను అలా కనిపిస్తాను`` అన్నారు వర్మ.

ఇక ఎన్టీఆర్ గురించి వ్యాఖ్యానిస్తూ ``ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. నటుడిగా బాగా ఇష్టపడుతాను. ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన జీవితాంతం మహారాజులా.. చక్రవర్తిలా బతికారు. కానీ జీవితపు చరమాంకంలో మానసిక క్షోభను అనుభవించారు. అదే విషయాన్ని సినిమాలో చూపించాను`` అని వెల్లడించారు వర్మ. అభ్యంతరాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో పాత్రల పేర్లను మార్చాల్సి వచ్చిందని ఆయన తెలపడం విశేషం. అదేవిధంగా ఈ సినిమా తీసేటప్పుడు కొంతమందిని మాత్రమే కలిశాను. ఎందుకంటే వారికి తోచినట్టుగా, వారికి అనుకూలంగా ఉంటారనే ఉద్దేశంతో కలువలేదు అని వర్మ అన్నారు. అయితే వర్మ పేర్కొన్న ఈ మొత్తం అంశాల్లో పడకగది అంశం అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. వర్మ.. అంటే అదో టైపు అని మరోసారి తన మాటలతో రుజువైంది అని అంటున్నారు ఈ మాటలు విన్న జనం.