ఏమోయ్ ఆర్జీవీ... పాఠం నేర్చుకో...!

February 19, 2020

మన సినిమా వాళ్ల బుర్రలు ఒక్కోసారి బొత్తిగా పనిచేయవు. ‘మాస్టర్ మైండ్’ అనుకునే మన ఆర్జీవీ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ‘చంద్రబాబు పని పట్టేస్తాను’ అన్నట్టుగా, వీర లెవల్లో.. వీరావేశంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీశాడు. దానిని సెన్సార్ బోర్డ్ అడ్డుకుంది. ‘నా సినిమానే అడ్డుకుంటారా..? నా తడాఖా చూపిస్తా.... యూట్యూబులో విడుదల చేస్తా...’నంటూ హడావుడి చేశాడు. ఇంతలో, ఇది కోర్టుకు వెళ్లింది. మోదీ బయోపిక్, కేసీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్... ఇవేవీ ఇప్పుడే విడుదల చేయడానికి వీల్లేదంటూ ఏకంగా సుప్రీంకోర్టే ఆదేశించింది. అదే సుప్రీంకోర్టు... పశ్చిమ బెంగాల్ రాజకీయాలే ఇతివృత్తంగా తీసిన చిత్రాన్ని అక్కడి ప్రభుత్వం బలవంతంగా ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది...! అంతేకాదు, ఆ చిత్ర నిర్మాతలకు 20లక్షల రూపాయలను జరిమానాగా చెల్లించాలంటూ ఆదేశాలిచ్చింది..!! ఒకవైపేమో ఈ మూడు సినిమాలను వద్దంటే వద్దని చెబుతూ, మరోవైపేమో ఆ సినిమాను ఎందుకు అడ్డుకున్నావంటూ మమత ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడమేమిటి...? దీని వెనుక చాలా చిన్న లాజిక్ ఉంది. దానిని తెలుసుకునే ముందుగా, పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో చూద్దాం.


పశ్చిమ బెంగాల్ రాజకీయాల ఇతివృత్తంతో, పొలిటికల్ సెటైర్‌గా 'భోబిష్యోటర్ భూత్' పేరుతో ఓ చిత్రాన్ని అక్కడి నిర్మాతలెవరో తీశారు. ఇది ఇప్పటికే అక్కడ (ఫిబ్రవరిలో) విడుదలైంది. ఎన్నికల వేళ, ఇది తమకు రాజకీయంగా నష్టదాయకమని మమత భావించారు. పొలిటికల్ సెటైర్‌గా రూపొందిన ఈ చిత్రం... ఎన్నికల వేళ ప్రజలను ప్రభావితం చేసే అవకాశముంటుందని భయపడ్డారు. ఆమె అసలే కాళిక. ఈ సినిమాపై కన్నెర్ర చేశారు. ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్, మల్టీప్లెక్స్ ల నుంచి దానిని తొలగించారు. దీంతో, సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది. ఇది అన్యాయమంటూ సుప్రీం తలుపులను ఆ చిత్ర నిర్మాతలు తట్టారు. దీనిని సుప్రీం కోర్టు విచారించింది. మమత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఈ సినిమాను అడ్డుకోవడమంటే... భావ వ్యక్తీకరణ స్వేచ్చకు అడ్డుపడటమే. ఈ విషయంలో పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరించారు. బెంగాల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వానికి మేం ప్రత్యేకంగా చెబుతున్నాం... ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్‌లో స్క్రీనింగ్ చేయకుండా అడ్డుకోరాదు’’ అని, తీర్పునిచ్చింది. ఈ సినిమాను నిలిపివేసినందుకు శిక్షగా ఏకంగా 20లక్షల రూపాయల జరిమానా విధించింది.

మోదీ బయోపిక్, కేసీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్... ఇవేవీ ఇప్పుడే విడుదల చేయడానికి వీల్లేదని చెప్పిన సుప్రీంకోర్టు.. బెంగాల్లో ఆ రాజకీయ వ్యంగ్య చిత్రానికి ఎలా, ఎందుకు ఓకే చెప్పిందన్నది ప్రశ్న. బెంగాల్లో ఆ సినిమా ఫిబ్రవరిలోనే విడదలైంది. అప్పటికి ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాలేదు. ఎన్నికల కోడ్ అమలులోకి రాక ముందే విడుదలై, ప్రదర్శితమవుతున్న ఆ సినిమా... ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదు. మోదీ బయోపిక్, కేసీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం... ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక విడుదలకు సిద్ధమయ్యాయి. కోడ్ అమలు తేదీకి కనీసంగా ఒక రోజు ముందు విడుదలైనా కూడా... ఈ సినిమాలను ఏ ఒక్కరూ ఏ రూపంలోనూ అడ్డుకునేందుకు వీలుండేది కాదు. ఆయా చిత్రాల ద్వారా ఆశించిన రాజకీయ ప్రయోజనాలు కూడా నెరవేరేవి. పోలింగుకు ముందు, ప్రచారం జోరుగా సాగుతున్న రోజల్లో సినిమా విడుదల చేస్తేనే... తాము ఆశించిన ప్రభావం ఎక్కువగా ఉంటుందని దర్శకులు/నిర్మాతలు అనుకున్నారు. ఎన్నికల కోడ్ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈ రిస్క్ ఉంటుందని ముందుగానే గ్రహించిన ఆ బెంగాల్ నిర్మాతలు, ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు కలగకుండా చాలా తెలివిగా ‘కోడ్’ కూయక ముందే సినిమాను విడుదల చేశారు. అదీ సంగతి...! సుప్రీం తీర్పు వెనుకనున్న లాజిక్ ఇది...!!

ఏమోయ్ ఆర్జీవీ.., అన్నీ నీకే తెలుసునని అనుకుంటావ్. నీ అంతటి మేధావి ఎవ్వడూ లేడన్నట్టుగా మాట్లాడతావ్. మరి, ఇంత చిన్న విషయంలో ఎందుకు తప్పులో కాలేశావోయ్..? నువ్వు అర్జంటుగా ఆ బెంగాల్ నిర్మాతల వద్దకో, దర్శకుల వద్దకో వెళ్లి పాఠం నేర్చుకో...!!!