ఆర్జీవీ.. ది గుడ్ ఐడియా అనొచ్చా?

August 07, 2020

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ... ఎంట్రీ ఇచ్చారంటే ఎవరినైనా ఇట్టే ఓ ఆటాడేసుకుంటారు. అలా ఆర్జీవీ ఎవరిని బుక్ చేసినా... వారిపై ఓ రేంజిలో సెటైర్లు పడిపోతూ ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో ఆర్జీవీ ఎంట్రీ ఇచ్చారంటే... ఆయన ఎవరిని బుక్ చేస్తారా? అన్న ఆసక్తి ఉంటోంది. తాజాగా త్వరలో భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కూడా ఇప్పుడు ఆర్జీవీ టార్గెట్ చేశారు. భారత పర్యటనలో తన కోరిక తీరాలంటే ట్రంప్ ఏం చేయాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్జీవీ సంధించిన ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.

భారత పర్యటనలో ట్రంప్ కు అపురూప స్వాగతం పలుకుతామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది జనంతో ట్రంప్ కు వెల్ కమ్ చెప్పిస్తామంటూ మోదీ చెప్పారు. అదే విషయాన్ని తెలుసుకున్న ట్రంప్... తనకు భారత్ లో మిలియన్ల మంది స్వాగతం చెబుతారని వ్యాఖ్యానించారు. ఏకంగా కోట్ల మంది తనకు స్వాగతం చెప్పబోతున్నారని కూడా ట్రంప్ బడాయి పలుకులు పలికారు. ట్రంప్ నోట నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలనే ఆసరా చేసుకున్న ఆర్జీవీ... ట్రంప్ ను ఓ ఆటాడేసుకున్నారు.

ట్రంప్ ను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘ఇండియాలో ట్రంప్ ను 10 మిలియన్ల ప్రజలు ఆహ్వానించాలంటే ఒకటే దారి ఉంది. ట్రంప్ పక్కన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, సన్నీ లియోన్ లను నిల్చోబెడితే అది సాధ్యమే'’’అంటూ వర్మ చమత్కరించారు. ఆర్జీవీ ట్వీట్ పై నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కేఏ పాల్, మెగాస్టార్, పవన్ కల్యాణ్ లను మర్చిపోయారంటూ కొందరు రీట్వీట్ చేశారు.