ఆర్జీవీ స్వైర విహారం... దేవీ బాబు ఎక్కడున్నారో?

July 05, 2020

ఏపీలో ఎన్నికల సందడి ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో టీడీపీకి ఓటమి దక్కగా, వైసీపీకి భారీ విజయం దక్కింది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు నుంచి టీడీపీ అన్నా, ఆ పార్టీ అదినేత నారా చంద్రబాబునాయుడు అన్నా తనదైన శైలిలో పేట్రేగిపోతున్న సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ... లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పేరిట ఏపీలో పెను కలకమే రేపారు. వైసీపీకి చెందిన ఓ కీలక నేత నిర్మాతగా వ్యవహరిస్తే..... కేవలం ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బ కొట్టడమే లక్ష్యంగా వర్మ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. 

అయితే ఎన్నికల సంఘం సదరు చిత్రాన్ని రిలీజ్ కాకుండా అడ్డుకుంది. అయినా కూడా తగ్గని ఆర్జీవీ ఏపీలో కలకలమే రేపడానికి వచ్చి అడ్డంగా బుక్కైపోయారు. నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెడతానంటూ బెజవాడ వచ్చిన వర్మకు పోలీసులు తగిన రీతిలోనే బుద్ధి చెప్పి తిప్పి పంపారు. నాడు చంద్రబాబుపై కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేసిన ఆర్జీవీకి చుక్కలు చూపేందుకు ఎంట్రీ ఇచ్చిన టీడీపీ సానుభూతిపరుడు దేవీ బాబు చౌదరి... సంచలన వ్యాఖ్యలు చేసి వర్మను భయపెట్టారనే చెప్పాలి. చంద్రబాబును అనవసరంగా తిడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని వర్మకు వార్నింగ్ ఇచ్చిన దేవీ బాబు అందరి దృష్టినీ ఆకర్షించారు. 

మరి ఆదివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా వర్మ చేసిన ట్వీట్ ను చూసిన వారందరికీ ఇప్పుడు దేవీ బాబు చౌదరే గుర్తుకు వస్తున్నారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ సినిమాను తీస్తానని, షూటింగ్ మొత్తాన్ని విజయవాడ, అమరావతిలోనే పూర్తి చేస్తానని, ఈ చిత్రానికి కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ కు నిర్మాతగా వ్యవహరించిన రాకేశ్ రెడ్డే నిర్మాతగా ఉంటారని ప్రకటించారు. ఓ రకంగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటే.. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో కులాల గోలకు ఆజ్యం పోస్తున్న వర్మకు బుద్ధి చెప్పాలంటే... దేవీ బాబు చౌదరి లాంటి వాళ్లు ఎంట్రీ ఇవ్వక తప్పదన్న వాదన వినిపిస్తోంది.