ఇంటరెస్టింగ్... బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మనోడి చేతిలోకి

August 06, 2020
CTYPE html>
నిజమే... అంతా అనుకున్నట్లుగా జరిగితే... బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మన దేశానికి చెందిన వ్యక్తి చేతిలోకి వచ్చేసినట్టే. అటు ఎన్నారై సమాజంతో పాటు ఇటు మన దేశ ప్రజలకు ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ వార్త వాస్తవ రూపం దాలిస్తే... భారత ఐటీ రంగాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె భర్త రిషి సునక్ బ్రిటన్ ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారు. ఇటీవలే బ్రటిన్ ప్రధానిగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రిషి... థెరిసా మే హయాంలో బ్రిటన్ ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరపున యార్క్ షైర్ లోని రిచ్ మాండ్ నుంచి బరిలోకి దిగిన రిషి... ఎంపీగా విజయం సాధించారు. గతంలో ఆర్థిక ఉప మంత్రిగా కొనసాగిన రిషి పనితీరుపై జాన్సన్ సంతృప్తిగా ఉన్నారని... ఈ క్రమంలోనే బ్రిటన్ ఆర్థిక మంత్రిగా రిషినే నియమించాలని బోరిస్ భావిసున్నట్టు ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.
రిషి గురించిన మరిన్ని వివరాల్లోకి వెళితే... ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాలో నిర్వహించే చర్చల్లో రిషి పాల్గొనేవాడని, పార్టీ విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఈ క్రమంలో పార్టీ విజయంలో కీలక భూమిక పోషించిన రిషికి ఫిబ్రవరిలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఆర్థిక శాఖ పగ్గాలు దక్కనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 39 ఏళ్ల వయసున్న రిషి... ఇంగ్లాండ్ లోని హాంప్ షైర్ కౌంటీలో జన్మించారు. స్టాన్ ఫోర్డ్ వర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో రిషి తన సహ విద్యార్థిని అయిన అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక రిషి పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే... బ్రిటన్ రాజకీయాల్లో యమా యాక్టివ్ గా ఉన్న రిషి రిచ్ మాండ్ నుంచి ఎంపీగా ఎన్నిక కావడం ఇది వరుసగా మూడోసారి. మొత్తంగా అంతా అనుకున్నట్లు జరిగితే.. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం మనోడి చేతిలోకి వచ్చేసినట్టేనన్న మాట.