​రోజాకు పదవి దక్కింది గానీ...

May 25, 2020

అధికారంలోకి రాకముందు వైసీపీ ప్రభుత్వంలో హోం మినిస్టర్ గా ప్రచారం అయిన ఆర్కే రోజాకు జగన్ పెద్ద షాకే ఇచ్చారు. ఇది ఆమె గాని ఆమె అభిమానులు గాని, వైసీపీ వాళ్లు గాని ఊహించని షాక్. అయితే ప్రచారం జరిగినట్టు హోంమంత్రి కాకపోయినా కనీసం ఏదో ఒక మంత్రి అవుతుంది అనుకుంటే అదీ జరగలేదు. దీంతో ఆమె చాలా డీలాపడింది. ఎంత డీలాపిందంటే... పార్టీ కార్యక్రమాలకు బంక్ కొట్టేసింది. దీంతో ఆమె అలకను గుర్తించిన జగన్ బాధపడకు వెయిట్ చెయ్ అంటూ అభయమిచ్చారు. 

దీంతో మీడియాతో ఆమె మాట్లాడారు. జగన్ సీఎం అయితే నేనే సీఎం అయినట్లు అంటూ ఒక చక్కటి సినిమా డైలాగ్ వేసింది. చాలా వేగంగా ఆమె అసంతృప్తిని చల్లార్చారు ముఖ్యమంత్రి జగన్. ఈరోజు ఆమెను కీలకమైన ఓ పోస్టులో కూర్చోపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) సంస్థ ఛైర్మన్ గా జగన్ ఆమెను నియమించారు. ఆమె దీనిపై అధికారికంగా ఫేస్ బుక్ లో ఓ పోస్టు కూడా పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ... జగన్ ఐడియా మామూలు ఐడియా కాదు. 

రోజా ఛైర్మన్ గా నియమితులైన సంస్థ ఏపీలో కీలకమైనది. కానీ ఆ పోస్టు ఏ ప్రభుత్వంలో అయినా విధేయులకు దక్కుతుంది. దీనికి కారణం ఏంటంటే... కార్పొరేట్లకు స్థలాలు మొదలుకుని అన్నిరకాల అవసరాలు తీర్చే సంస్థ అది. దాని కార్యకలాపాలకు సంతకం పెట్టాల్సింది ఛైర్మన్ అయినా, నిర్ణయం మాత్రం ఎపుడూ ముఖ్యమంత్రులే తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే... ముఖ్యమంత్రుల ఆలోచనలను ఇంకొకరి పేరుతో అమలు చేయడం అన్నమాట. గతంలో ఈ పోస్టులో వైఎస్ హయాంలో అంబటి రాంబాబు ఉన్నారంటే ఆ పోస్టు ఏంటో అర్థం చేసుకోవచ్చు. అత్యున్నత పోస్టే గాని విధేయలకు ఇవ్వడానికి కారణం ముఖ్యమంత్రి మనసు తెలుసుకుని ఆ సంస్థ నడవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అభివృద్ధి కాంక్షను బట్టి ఆ సంస్థ జనానికి ఉపయోగపడుతుందా? కొందరికి ఉపయోగపడుతుందా ? అన్నది డిసైడవుతుంది. అంటే రోజాకు హోదా ప్రకారం, పబ్లిసిటీ ప్రకారం మంచి పోస్టే దక్కిందని సంబర పడటానికి మాత్రం మంచి పోస్టే. అందులో ఏం సందేహం లేదు. కానీ మిగతాదంతా ఓకే సీఎం ఓకే సీఎం ఓకే సీఎం అన్నమాట.