రోజా ఇలాకాలో రెడ్డి రాజ్యం వర్సెస్ కేజే ఫ్యామిలీ !!

May 26, 2020

చిత్తూరు జిల్లా న‌గ‌రి రాజ‌కీయాలు ఆస‌క్తితో పాటు తీవ్ర ఉత్కంఠ‌ను కూడా రేపుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాదించారు న‌టి, జ‌బ‌ర్ద‌స్త్ రోజా. త‌న కృసి ఫ‌లితంగానే వైసీపీ ఇక్క‌డ నిల‌బ‌డింద‌ని, వైసీపీ ఎదుగుద‌ల‌కు తాను ఎంతో కృషి చేస్తున్నాన‌ని ప‌దేప‌దే చెప్పారు. అయితే, నిన్న మొన్న‌టి వ‌ర‌కు బాగానే ఉన్న న‌గ‌రి రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. న‌గ‌రిలో కేజే వ‌ర్గంగా గుర్తింపు పొందిన కేజే కుమార్ దంప‌తులు ఒక్క‌సారిగా రోజాపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ‌కీయంగా తాము రోజా కోసం ఎంతో త్యాగం చేస్తే.. ఇక్క‌డ ఆమె రెడ్డి రాజ్యాన్ని సృష్టించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ఒక్క‌సారిగా న‌గ‌రి రాజ‌కీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. 

విష‌యంలోకి వెళ్తే.. వ‌రుస‌గా రెండోసారి ఎన్నికై, రాష్ట్రంలో కీల‌క‌మైన ఏపీఐఐసీకి చైర్ ప‌ర్స‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నేప‌థ్యంలో రోజాకు న‌గ‌రి వైసీపీ నాయ‌కులు ఘ‌న స‌న్మానం ఏర్పాటు చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న పార్టీలోని కీల‌క నాయ‌కులు కేజే కుమార్‌, కేజే శాంతిలు స‌మావేశా నికి చేరుకున్నారు. వారితో పాటు భారీ ఎత్తున వారి అనుచ‌రులు కూడా కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో రోజాను టార్గెట్  చేసిన కుమార్‌.. ఆమెతో వాగ్వాదానికి దిగారు. అనంత‌రం స‌భ‌లోనే కేజే కుమార్‌ మాట్లాడు తూ.. రోజా టీడీపీ తరఫున రెండు సార్లు ఓడిపోవడంతో తానే స్వయంగా ఆమెను వైసీపీ తరఫున పోటీ చేయమని ఆహ్వానించానన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించానన్నారు. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని, ఎమ్మెల్యే కుటుంబ పాలన ఎక్కువైందని ఆరోపించారు. 

తాము గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నామ‌ని, జైళ్ల‌కు కూడా వెళ్లామ‌ని, అయినా కూడా ఎక్క‌డా ధైర్యం కోల్పోకుం డా పార్టీ కోసం, న‌గ‌రిలో రోజా గెలుపు కోసం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొని మ‌రీ ఆమెను గెలిపించామ‌ని అయినా కూడా ఆమె త‌మ‌ను ఎక్క‌డా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. అంతేకాదు, వీటిని చూస్తూ ఉరుకునే ప్రసక్తే లేదన్నారు. తాము ఈ విషయాన్ని సీఎం జగన్‌ వద్దే తేల్చుకుంటామని, అన్ని వాస్తవాలూ అక్కడే చెబుతామని ప్రకటించారు.  ఇక, ఈయ‌న స‌తీమ‌ణి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కేజే శాంతి మాట్లాడుతూ, అంతా కుల రాజకీయాలైపోయాయని, ఒక వర్గం వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. దీంతో న‌గ‌రి పాలిటిక్స్ గ‌రంగ‌రంగా మారిపోయాయి. మ‌రి దీనిపై జ‌గ‌న్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.