బాలయ్యతో రోజా సెల్ఫీ... అదిరిపోయిందబ్బా

February 27, 2020

ఏంటేంటీ... రోజా విత్ బాలయ్య, బాలయ్యతో రోజా సెల్ఫీనా?... అప్పుడెప్పుడో ఇద్దరూ సినిమాల్లో ఉన్నప్పుడు అయితే ఈ కామెంట్లకు, ఈ తరహా ఫొటోలకు పెద్దగా ప్రాదాన్యం లేదు గానీ, ఇప్పుడు భిన్న ధృవాలుగా మారిపోయిన వీరిద్దరూ కలిసి కనిపిస్తే, కలిసి సెల్ఫీ తీసుకుంటే... ఆసక్తికరమే కదా. అదిరిపోయిందని చెప్పక తప్పదు కదా. నిజమే... ఈ ఇద్దరు కలిసిన ఓ ఫొటో బుధవారం సోషల్ మీడియాన ఓ ఊపు ఊపేసింది. ఏపీ శాసనమండలి విజిటర్స్ గ్యాలరీలో చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలతో కలిసి బాలయ్య కూర్చోగా... అప్పుడే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా కూడా తన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేతో కలిసి వచ్చారు. ఈ సందర్బంగా అక్కడ చంద్రబాబు ఉన్నారన్న విషయాన్ని కూడా పక్కనపెట్టేసిన రోజా... బాలయ్యతో కలిసి సెల్పీకి సిద్ధపడ్డారు. అది గమనించిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రోజా దగ్గరకు చేరి సెల్ఫీకి రెడీ అయిపోయారు. ఇప్పుడు ఈ సెల్ఫీ వైరల్ గా మారిపోయింది.

సినిమాల్లో ఉన్నంత కాలం బాలయ్య, రోజా జోడీ మంచి జోడీనే. అయితే రాజకీయాల్లోకి వచ్చేసిన రోజా... అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నా... హీరోయిన్ గా మాత్రం చేయట్లేదు. అంతేకాకుండా ఇప్పుడు వైసీపీ అధికార పార్టీగా మారిన నేపథ్యంలో రోజా రాజకీయాల్లో మరింత బిజీ అయిపోయారు. అంతేకాకుండా టీడీపీ అన్నా, చంద్రబాబు అన్నా... ఓ రేంజిలో విరుచుకుపడుతున్న రోజా... ఎప్పుడు అవకాశం చిక్కినా చంద్రబాబును కడిగిపారేస్తున్నారు. ఇక టీడీపీ హయాంలో రోజాను ఏకంగా ఏడాదికి పైగా సస్పెండ్ చేసిన నాటి నుంచి టీడీపీ, రోజాల మధ్య మరింత దూరం పెరిగిందనే చెప్పాలి. ఇక బాలయ్య 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వెరసి సినిమాల్లో హీరోహీరోయిన్లుగా చేసిన బాలయ్య, రోజాలు ఇప్పుడు రెండు బద్ధ విరోధులుగా ఉన్న టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. 

రోజా వైసీపీ ఎమ్మెల్యేగా టీడీపీ నేతలపై ఎంతలా విరుచుకుపడుతున్నా...బాలయ్య ప్రస్తావనను మాత్రం తీసుకొచ్చిన సందర్భం లేదనే చెప్పాలి. అదే సమయంలో బాలయ్య కూడా పెద్దగా రోజాపై విమర్శలేమీ చేయడం లేదు. వెరసి రెండు వేర్వేరు పార్టీల్లో ఉన్నా వీరి మధ్య అంతగా శత్రుత్వం లేదనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో... బుధవారం అట్టుడుకుతున్న శాసనమండలి సమావేశాలను వీక్షించేందుకు టీడీపీ, వైసీపీ నేతలు క్యూ కట్టగా... శాసనమండలి విజిటర్స్ గ్యాలరీ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా బాలయ్యను చూసిన రోజా.. ఆయనతో సెల్ఫీ అనగానే... వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉత్సాహంగా వారి సెల్ఫీలో కనిపించేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.