స్పీకర్ పదవికి రోజా పేరు.. అసలు కారణం ఇదే

January 24, 2020

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొలువు దీరిన తర్వాత ఓ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదే.. అసెంబ్లీ స్పీకర్ ఎంపిక. దీనికి కారణం ఆ పార్టీలో స్పీకర్ పదవి చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రచారం జరుగుతుండడమే. ఇరవై ఏళ్లుగా ఉమ్మడి ఏపీతో పాటు రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ నాయకులెవ్వరూ స్పీకర్ పదవిని చేపట్టడానికి ఆసక్తి చూపడం లేదని కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. మొదట కొందరు సీనియర్ నేతల పేర్లు వినిపించినా.. తాజాగా నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పేరు బయటకు వచ్చింది. అవును.. ఆమెకు స్పీకర్ పదవి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మంత్రి పదవి రేసులో ఉన్న రోజాకు స్పీకర్ పదవి ఇవ్వనుండడం దాదాపుగా ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం దీనిని నిజమేనని చెబుతున్నారు. రోజా విషయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ తరపున ఎన్నికైన చాలా మంది ఎమ్మెల్యేలు తమ సామాజికవర్గానికి చెందిన వారే. రోజా కూడా అదే సామాజికవర్గం. జగన్ ఏర్పాటు చేయబోతున్న మంత్రి వర్గంలోనూ వారే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రోజాను కేబినెట్ నుంచి తప్పించి, స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికితోడు ఆమెకు అవకాశం కల్పిస్తే మహిళను గౌరవించినట్లు కూడా ఉంటుందని జగన్ ఆలోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

స్పీకర్ పదవి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలతో జగన్ మంతనాలు జరిపారని, వారంతా ఆ పదవి చేపట్టడానికి ముందుకు రావడం లేదనే టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కోన రఘుపతి పేరును ఫైనల్ చేశారని అంతా అనుకున్నారు. బాపట్ల ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందిన కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఆయన తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయనకే స్పీకర్ పదవి ఇస్తారని భావించినా.. ఇప్పుడు అనూహ్యంగా రోజా పేరు తెరపైకి రావడం చర్చనీయాంశం అవుతోంది.