ప్రజల ప్రాణాలతో రోజా చెలగాటం 

June 05, 2020

కరోనాపై జరిగినంత ప్రచారం బహుశా ప్రపంచంలో మరి దేనిమీద జరిగి ఉండకపోవచ్చు. అందుకే కరోనా జాగ్రత్తలు, లాక్ డౌన్ నిబంధనల గురించి ఒకటో తరగతి పిల్లలను అడిగినా టకటక చెప్పేస్తారు. కానీ దయచేసి వైసీపీ ఎమ్మెల్యేలను మాత్రం అడగకండి. ఒకవైపు ఏపీ మూడో దశలోకి వెళ్లిందని ప్రకటన... మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నేతల ర్యాలీలు, దానధర్మ సమావేశాలు.. ఇదీ ఏపీ పరిస్థితి. వైసీపీ లో కీలక నేత విజయసాయిరెడ్డి అయితే... గుడ్డుకు, పండుకు కూడా జనాన్ని పోగేసి పంచుతున్నారు. ధర్మం చేయాలనుకుంటే గుప్తంగా చేయొచ్చు. ఎదుటి వారికి ప్రచార పిచ్చి ఉందని చెప్పి నీతులు చెప్పే సాయిరెడ్డి నిత్యం చిన్నిచిన్న విషయాలకు కూడా పబ్లిసిటీ చేసుకుంటూ నిబంధనలు ఉల్లంఘిస్తూ కరోనా వ్యాప్తికి వీలైనంత దోహదం చేస్తున్నారు.  

తాజాగా రోజా రెడ్ జోన్ లో ఉన్న చిత్తూరు జిల్లాలో నగరి ఎమ్మెల్యే రోజా... నియోజకవర్గంలో ఓ ప్రారంభోత్సవం పెట్టారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలను తరలించారు. అక్కడ భయానక వాతావరణం. సామాజిక దూరం లేదు. పక్కపక్కనే నిలబడి అడుగడుగునా పూలు జల్లుతూ ఆమెకు జనం ఆహ్వానం. ఇంతకీ ఆమె ఏ స్కూలు భవంతో ప్రారంభించింది అనుకున్నారేమో... ఒక మంచినీటి బోరు ప్రారంభించారు. వాస్తవానికి ఆ బోరు వేయడానికి లక్షన్నర ఖర్చు అయితే... ఈ ప్రారంభోత్సవానికి చేసిన హడావుడికి అంతకుమించి ఖర్చు చేశారు. ఈ ఖర్చు పక్కన పెడితే... ప్రజలను పోగేసి వారి ప్రాణాలను రిస్కులో పెట్టింది ఎమ్మెల్యే రోజా. అయినా బోరును ప్రారంభించాల్సి అవసరం ఏముంది? అది కూడా ఈ లాక్ డౌన్ సమయంలో? ఒక్కరికి కరోనా ఉంటే అది ఈ కార్యక్రమం ద్వారా ఎంతమందికి సోకుతుందో అంచనా వేయడం కూడా కష్టం. పైగా నిస్సిగ్గుగా ఆ ప్రారంభోత్సవం వీడియోను తెచ్చి సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. 

ఒకవైపు ప్రధాని గడప దాటొద్దు. అపుడే కరోనాపై విజయం సాధించగలం అని చెబుతుంటే వీరి మూర్ఖత్వం ప్రజల ప్రాణాల మీదకు వచ్చేలా ఉంది. మొన్నకూడా పీపీఈ కిట్ వేసుకుని శానిటైజర్ తో పిచికారీ చేసే ప్రయత్నం. ఆహార పొట్లాలు పంచడానికి జనాన్ని అందరినీ ఒక చోటుకు తేవడం. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నేతలు ఎక్కడా ఇలాంటి పిచ్చి సభలు, సమావేశాలు, సామూహిక దానధర్మాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు. చాలావరకు ఇంటికి దానం అందేలా చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు స్థానిక ఎన్నికల పిచ్చితో జనాలు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. 

ఇటీవలే నెల్లూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కూడా 4000 మందిని ఒక చోట తెచ్చి సరుకులు పంచారు. అక్కడ సరుకులు పంచినట్టు లేదు. కరోనా సమావేశం ఏర్పాటుచేసినట్లుంది. పైగా పోలీసు కేసు పెడితే వారిని బెదిరిస్తూ స్టేషను ముందు ధర్నాకు తెగబడ్డారు. వీరు చేస్తున్న పనికి జనం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.