జగన్ ది రౌడీ పాలన - ఈ మాటన్నదెవరంటే?

August 04, 2020

రాజన్న పాలన అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పుకుంటున్న ఏపీలో రాజన్న పాలన నడవడం లేదని, రౌడీ జగనన్న పాలన నడుస్తోందని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ నిప్పులు చెరిగారు. రాజన్న పాలన నడుస్తుందని ఆయన పరువు తీయొద్దని, రాజశేఖర్ రెడ్డి శత్రువులను కూడా క్షమిస్తాడని... రాజన్ను కులద్వేషం లేదని ఆమె అన్నారు. నన్నే ప్రశ్నిస్తారా ? అన్న అహంకారంతో జగన్ పాలన నడుస్తోందని... మంచి జగన్ చెవికి ఎక్కదని ఆమె విమర్శించారు.

ఒక దళిత డాక్టరును అంత దారుణంగా హింసిస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా? అని నిలదీశారు. ఏ తప్పు చేసినా చట్టం ప్రకారం ఇలాంటి శిక్ష వేయరు అని... ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కు రోడ్డు మీద ఒక దళిత డాక్టరును తాళ్లతో కట్టేసి కొట్టే అధికారం ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. దళితులంటే మీకు అంత హీనంగా కనిపిస్తున్నారా? రోడ్డుపై కొట్టుకుంటూ బట్టలూడదీసి ఈడ్చుకెళతారా? మాస్కులు అడిగితే పిచ్చివాడని ముద్ర వేస్తారా? ఇది అరాచకానికి పరాకాష్ట.  

దీనిని రాజన్న పాలన అని పిలవొద్దని మరోసారి హెచ్చరిస్తున్నాం. ఇది ముమ్మాటికీ ఒక రౌడీ పాలన అన్నారు. రైతులను కొట్టారు. వలస కూలీలను చితకబాదారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద కాపలా వేశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారు. కొడతారు. పోలీసులపై వలంటీర్లు దాడికి దిగుతారు. ఏమిటీ అరాచకం అని ఆమె ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు చీ కొట్టి పదవి పీకేస్తారని హెచ్చరించారు.