గోదావ‌రి జిల్లాలు...ఢిల్లీ రాజ‌కీయాల‌పై ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర‌ కామెంట్లు

June 01, 2020

ఏపీ రాజ‌కీయాల‌పై జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ – జనసేన పార్టీలు సంయుక్తంగా స్థానిక సంస్థల విజన్ డాక్యుమెంట్ విడుదల చేశాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజ‌కీయాలు, ఢిల్లీలో రాష్ట్రం గురించి జ‌రుగుతున్న చ‌ర్చను గురించి వివ‌రించారు. ఏపీ బీహార్‌ను మించిపోయింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంద‌ని ప‌వ‌న్ అన్నారు. అంతేకాకుండా గోదావ‌రి జిల్లా గురించి సైతం ఆయ‌న ఆస‌క్తిక‌రంగా వివ‌రించారు.
``ఈ మధ్య ఢిల్లీలో కొంతమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు వాళ్లు ఏపీ మరో బీహార్ రాష్ట్రంలా తయారవుతోంది అని అన్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన నాయకులపై రాళ్ల దాడులు చేసి, నామినేషన్ పత్రాలను చించివేయడం, ప్రశాంత గోదావరి జిల్లాల్లో భూసేకరణ పేరుతో భూములు లాక్కొంటామని, బైండోవర్ కేసులు పెడతామని రైతులను బెదిరించడం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. నామినేషన్ల వేళ ఇంతటి హింసను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో ఎప్పుడు చూడలేదు. ఎక్కడో అడపాదడపా చిన్న చిన్న సంఘటనలు జరిగాయి తప్ప... 13 జిల్లాల్లో ఇప్పుడు ఏ మూలన చూసినా అరాచకాలే. ప్రశాంతమైన గోదావరి జిల్లాలకు కూడా రౌడీయిజం వచ్చేసింది.`` అంటూ ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న తీరుపై ప‌వ‌న్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ``పోలీసు అధికారులు, ఎలక్షన్ అధికారుల ముందే వేరే పార్టీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.  దుర్గి మండలంలో అభ్యర్థులను పోలీస్ అధికారులే బెదిరిస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ పక్షంలా వ్యవహరిస్తున్నారు. కళ్లెదుటే అన్యాయం జరుగుతుంటే  కొంతమంది అధికారులు పట్టించుకోవ‌డంలేదు. శేషన్ లాంటి వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉంటే ఇలా జరిగేదా..? రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు తమ బాధ్యతలు గుర్తు చేసుకోవాలి. సామాన్యులకు అన్యాయం జరగకుండా బాధ్యత తీసుకోవాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీల నామినేషన్ల సందర్భంగా వైసీపీ చేసిన దౌర్జన్యాలను కేంద్రం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం.`` అని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.