లక్ష రూపాయలు... వడ్డీ లేకుండా- వావ్ మోడీ

July 10, 2020

గ్రామీణ మహిళలకు అవసరానికి వెయ్యి రూపాయలు దొరకాలంటే చాలా కష్టం. దానికి ఎన్నో సంజాయిషీలు, కారణాలు చెప్పుకుంటే స్నేహితుల వద్ద కూడా చేబదులు దొరకడం కష్టం. పేదరికమో, ఇంకే కారణం వల్లనో చెల్లింపుల్లో ఆలస్యం జరగడం వల్ల తెలిసినవారితో నమ్మకం కోల్పోయి చేబదులు దొరికే పరిస్థితి చాలామందికి ఉండదు. ఒకరిద్దరు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడంలో చేసే ఆలస్యం వల్ల... మంచి వాళ్లకు కూడా డబ్బు పుట్టదు. డబ్బు అడిగితే ఎందుకొచ్చిన గొడవలే అన్నట్టు అనుమానంగా చూస్తారు. అందుకే పేదలకు చేబదులు లేదా అప్పు ఇవ్వడానికి ఎవ్వరూ మొగ్గుచూపరు.
తెలివితేటలు ఉన్నా...ఏదైనా చేయాలని తపన ఉన్నా... చిరు వ్యాపారాలు, స్వయంఉపాధి కార్యక్రమాలు చేసి సంపాదించగలిగిన సామర్థ్యం ఉన్న కొందరు మహిళలు కూడా జీవితంలో ఎదగలేక అలా పేదలుగా మిగిలిపోతున్నారు. ఇక నుంచి అలాంటి కష్టాలకు చెల్లుచీటీ ఇచ్చింది మోడీ సర్కారు. ఈ బడ్జెట్ లో డ్వాక్రా సంఘాలకు కీలక నిర్ణయం ప్రకటించారు. లక్ష వరకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తారు. డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి మహిళ దీనికి అర్హురాలే. ఇది గ్రామీణ మహిళలకు అతిపెద్ద వరం కిందే లెక్క. స్వావలంబన సాధించి జీవితంలో ఎదగాలనుకున్న మహిళలకు ఇది గొప్ప సదవకాశం.
దీంతో పాటు తక్షణ అవసరాల కోసం డ్వాక్రా మహిళలకు మరో వరం ప్రకటించారు. జన్ ధన్ ఖాతా ఉంటే... 5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తారు. ఇది పేదలను ఎన్నో అవమానాల నుంచి కాపాడే మంచి నిర్ణయం. కనీసం ఈ నిర్ణయాల వల్ల పది శాతం మంది ఏటా పేదరికం నుంచి బయటపడినా పదేళ్లలో దేశంలో పేదరికాన్ని బాగా తగ్గించవచ్చు.