ఆరెస్సెస్ ఎంట్రీ... జీవీఎల్ మాట మార్చేశారుగా

February 22, 2020

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీకి చెందిన నేతే అయినా... ఏపీ అంటే తనకు బద్ధ శత్రువు అన్నట్లే వ్యవహరిస్తున్న తీరు నిజంగానే ఏపీ ప్రజలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చిన సంగతి తెలిసిందే. అయినా ఓ పార్టీకంటూ విధానం ఉంటుంది కదా... ఆ విధానాన్ని కూడా దాటేసి తనకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిన జీవీఎల్... ఇప్పుడు బీజేపీ సిద్ధాంతకర్తగా వ్యవరిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) రంగంలోకి దిగడంతో తన స్పీడును తగ్గించుకోక తప్పలేదన్న వాదన వినిపిస్తోంది. తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ఏర్పడ్డ ఏపీని త్వరితగతిన ఒడ్డున పడేసేందుకు తన సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... ఓ మాస్టర్ ప్లాన్ ను రచించారు. అందులో భాగంగానే నవ్యాంధ్రకు నూతన రాజధానిగా అమరావతి ఎంపికైంది. అయితే ఈ అమరావతిని పురిట్లోనే చంపేసేలా ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు మద్దతు పలుకుతూ జీవీఎల్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు పూర్తి మద్దతు పలుకుతున్నట్లుగానే వ్యవహరిస్తున్న జీవీఎల్... రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమేనని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదని కూడా ఆయన చెప్పారు. అమరావతిని నోటిఫై చేసినా.. జగన్ ఇప్పుడు కొత్తగా ఏది రాజధాని అంటే... దానిని మళ్లీ నోటిఫై చేస్తామని కూడా తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు సర్కారు జారీ చేసిన గెజిట్ ఏమైనా శిలాశాసనమా? అని కూడా ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ వేదికగా పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో జీవీఎల్ నోట ఈ వ్యాఖ్యలు రావడం కలకలం రేపింది. జగన్ కు బీజేపీ పూర్తిగా మద్దతు ఇచ్చినట్టేనా? అన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగాయి. 

అయితే ఈ పరిణామాలను లోతుగా పరిశీలించిన ఆరెస్సెస్ కు చెందిన కీలక నేత రతన్ శార్షా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులు చెత్త ప్రతిపాదన అని ఆయన ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా జీవీఎల్ వ్యాఖ్యలను ప్రస్తావించిన రతన్... జగన్ ప్రతిపాదనలకు బీజేపీ మద్దతిస్తోందా? అని కూడా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఈ క్రమంలో ఆరెస్సెస్ నుంచి జీవీఎల్ కు మంచి క్లాస్ పడినట్టే ఉంది. ఫలితంగా వెంటనే మాట మార్చేసిన జీవీఎల్...  పార్టీపరంగా ఏపీ రాజధాని అమరావతేనని తాము రాజకీయ తీర్మానం చేశామని చెప్పారు. అమరావతి నుంచి రాజధానిని తీసేయాలని తమకేమీ కోరిక లేదని, కక్ష అంతకన్నా లేదని మాట మార్చేశారు. రాజకీయ కారణాలు అసలే లేవని, దీనిపై అపోహలు సృష్టించడం తప్ప మరొకటి కాదన్నారు. అయితే ఈ అంశానికి కోర్టులో పరిష్కారం లభించవచ్చని అభిప్రాయపడ్డారు. అంటే.. ఆరెస్సెస్ ఒత్తితే గానీ జీవీఎల్ తగ్గలేదన్న మాట.