50 వేల ఓట్ల కోసం జనాలకు టోపీ పెట్టిన జగన్

July 16, 2020
  • ఆర్టీసీ విలీనం ప్రజలు కోరారా?

  • సిబ్బందికి వేతనాలివ్వడానికి

  • బస్సు చార్జీలు పెంచుతారా?

  • ఏటా 1000 కోట్లు వారెందుకు చెల్లించాలి?

  • రాష్ట్రం జగన్‌ జాగీరా?

  • జనం గెలిపించింది ఇందుకేనా?

అనాలోచిత విధానాలు, అస్తవ్యస్త పాలనతో నవ్యాంధ్ర విలవిలలాడుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ ఓటుబ్యాంకు రాజకీయాలు ప్రజలను తీవ్ర ఇక్కట్లపాల్జేస్తున్నారు. ప్రజలపై పైసా భారం వేయనని పాదయాత్రలో చెప్పారు. పన్నులు, చార్జీలు పెంచబోమని.. చంద్రబాబు అడ్డగోలుగా పెంచారని ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీ చార్జీలను పెంచాలని నిర్ణయించడం కచ్చితంగా ప్రజలను మోసగించడమే. సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా.. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన ఆయన.. తీరా అమలు విషయానికి వచ్చేటప్పటికి ఏం చేయాలో పాలుపోక.. సంస్థను కాకుండా.. సిబ్బంది వరకు విలీనం చేస్తానని చెప్పారు. ఈ సంస్థలో కేంద్రానికి మూడో వంతు వాటా ఉంది. పైగా ఉమ్మడి ఆర్టీసీ విభజన పూర్తిస్థాయిలో జరగనేలేదు. ఆర్టీసీ అంటే డ్రైవర్లు, కండక్టర్లు మాత్రమేనని జగన్‌ భావిస్తున్నారని అర్థమవుతోంది. ఆంజనేయరెడ్డి కమిటీ ప్రాథమిక నివేదిక చూసేదాకా ఆయన అదే ఉద్దేశంలో ఉన్నారు. ఆ సంస్థకు గుదిబండగా లెక్కలేనంత మంది అధికారులు ఉన్నారన్న విషయం ఆయనకు తెలిసినట్లు లేదు. పైగా వారికి ప్రభుత్వ ఉద్యోగుల కంటే అధికంగా వేతనాలు ఉన్నాయి. ఇప్పుడు విలీనం చేస్తే వారే తీవ్ర ఇబ్బందులు పడతారు.

ఆర్టీసీ స్థానంలో ప్రజారవాణా వ్యవస్థ (పీటీఎస్‌) ఏర్పాటుకు ఓపక్క ప్రయత్నాలు జరుగుతుండగా.. ఇప్పుడు అకస్మాత్తుగా చార్జీలు పెంచాలనుకోవడం గర్హనీయం. ఆరునెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకొంటానన్న జగన్‌, ఆ మాట నిలుపుకొన్నా లేకున్నా.. మధ్యతరగతికి మాత్రం చురక అంటించారు. ప్రతి కిలోమీటరుకు పల్లె బస్సులపై (వెలుగు సర్వీసులు) పది పైసలు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులపై ఇరవై పైసలు వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సూపర్‌ లగ్జరీలో వెళ్లాలంటే రూ.317 వసూలు చేస్తున్నారు. కొత్త చార్జీలు అమల్లోకి వస్తే రూ.371 చెల్లించాలి. ఏసీ అమరావతి బస్సులో రూ.544 నుంచి రూ.598 చెల్లించాల్స ఉంటుంది. తిరుపతి, విశాఖ, బెంగళూరు, చెన్నైలకూ భారీగా చార్జీలు పెరిగాయి. సంస్థ నష్టాల్లో ఉన్నందునే చార్జీలు పెంచాల్సి వచ్చిందని.. ఇదేమంత భారం కాదని రవాణా మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. కానీ ఏటా సుమారు రూ.1,000 కోట్ల భారాన్ని ఆర్టీసీ బస్సులు ఎక్కే సామాన్యులు మోయనున్నారు. అయితే ఏటా రూ.1,200 కోట్ల మేర నష్టాలు వస్తున్నాయని.. తాము కొంత తగ్గించామని ఎంతో దయతో మంత్రిగారు సెలవిస్తున్నారు.

అన్ని సర్వీసులపైనా..
13 జిల్లాల్లో 3,803 రూట్లలో 11,763 బస్సులు నడుపుతూ 65 లక్షల మంది ప్రయాణికులను రోజూ గమ్యస్థానాలకు ఆర్టీసీ చేరుస్తోంది. ఈ సంస్థలో 53 వేల సిబ్బంది పనిచేస్తున్నారు. పల్లె బస్సుల నుంచి ఏసీ స్లీపర్‌ దాకా అన్ని సర్వీసులు సరాసరి రోజుకు 365 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఈ సర్వీసులపై పెంచిన చార్జీలు త్వరలోనే అమలులోకి రానున్నాయి. తెలంగాణలో మాదిరిగానే ప్రతి కిలోమీటరుకు రూ.20పైసల చొప్పున పెంచిన ప్రభుత్వం.. పల్లె బస్సుల్లో పది పైసలు పెంచింది. దీంతో సగటు గ్రామీణ ప్రయాణికుడిపై రూ.4వరకూ అదనపు భారం పడుతుండగా, ఇతర బస్సుల్లో ఒకసారి పోయి, రావడానికి రూ.100వరకూ చెల్లించాల్సి ఉంటుంది. కార్మికులు కష్టపడుతున్నారు. ప్రయాణికులు ఆదరిస్తున్నారు. ఫలితంగా నాలుగేళ్లలో పదిశాతం ఆక్యుపెన్సీ పెరిగి 80శాతానికి చేరింది. దీంతో సంస్థ ఆదాయం 2015-16లో రూ.4,940 కోట్లు వస్తే 2018-19లో రూ.5,995 కోట్లకు పెరిగింది. నాలుగేళ్లలో వెయ్యికోట్లకుపైగా ఆదాయం పెరిగింది. అయినా నష్టం ఎందుకని ప్రశ్నిస్తే.. డీజిల్‌ ధరల పెరుగుదల, పల్లెవెలుగు బస్సుల నష్టాలు, మోటారు వాహన పన్ను భారం, అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం ఆర్టీసీని కుంగదీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక బస్సు కిలోమీటరు నడపడానికి ఆర్టీసీకి రూ.44.58 ఖర్చవుతుంటే, ఆదాయం 38.05 రూపాయలు మాత్రమే వస్తోంది. అంటే ప్రతి కిలోమీటరుకు ఆర్టీసీపై పడుతున్న భారం 6.53 రూపాయలు. అప్పులకు ఏటా రూ.300 కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నారు. ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే 2017-18లో ఆదాయం రూ.5,583 కోట్లు వస్తే ఖర్చు రూ.6,788 కోట్లు వచ్చింది. అంటే ఏడాదికి రూ.1,205 కోట్ల నష్టాన్ని తగ్గించుకోవడానికి అధికారులు, కార్మికులు పడిన శ్రమవల్ల గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.5,995 కోట్లకు పెరిగింది. ఖర్చు కూడా రూ.7,025 కోట్లకు పెరిగినా ఏడాది మొత్తం మీద రూ.1,030 కోట్లకు తగ్గాయి. ఈ సమస్యల నుంచి ఆర్టీసీ గట్టెక్కాలంటే.. ఆర్టీసీ బస్సులపై ఏటా విధిస్తున్న రూ.300 కోట్ల మోటార్‌ వెహికిల్‌ టాక్స్‌ను ఐదేళ్ల పాటు పూర్తిగా ఎత్తేయాలని ఆర్టీసీ యాజమాన్యం గతంలోనే ప్రభుత్వానికి విన్నవించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సేవలందిస్తున్న పల్లె వెలుగు బస్సులపై వస్తున్న రూ.746 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం భరించాలని కోరింది. నాలుగేళ్లుగా టికెట్‌ ధరలు పెంచకపోవడంవల్ల ఇప్పుడు 30శాతానికి భారం చేరుకుందని, అదే ఏటా 7.5 పెంపునకు అనుమతి ఇచ్చిఉంటే ఇబ్బంది ఉండేదికాదని కూడా తెలిపింది. సిబ్బంది జీతభత్యాలు, బకాయిలు చెల్లించడంతోపాటు సంస్థ అప్పులు తీర్చడానికి నాలుగైదేళ్లపాటు సహకరిస్తే సంస్థ నష్టాల్లోంచి లాభాల బాట పట్టేది.

విలీన ప్రక్రియ ప్రారంభం అవడంతో ఈ ప్రతిపాదనలన్నీ మరుగున పడ్డాయి. నిజానికి రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటుచేసి, అన్నికోణాల్లోనూ సమీక్షించిన తర్వాత చార్జీలు పెంచేదీ లేనిదీ చెబుతామని జగన్‌ చెప్పారు. కానీ ఉన్న పళంగా భారం మోపారు. పల్లె బస్సులపై ఎంవీ ట్యాక్స్‌ తొలగిస్తే ఆర్టీసీకి నష్టమే రాదు. ఇదేమీ పట్టించుకోకుండా ‘యాజమాన్యం అడిగింది.. సీఎం సిగ్నల్‌ ఇచ్చారు’ అని మంత్రి నాని ప్రకటించేశారు. పైగా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్టీసీ చార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు.  సంస్థను నష్టాల ఊబి నుంచి తప్పించటానికి, ప్రైవేటు పరం చేసే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ‘విలీనం చేస్తే.. పాత అప్పులన్నీ ప్రభుత్వమే కట్టాలి. జీతభత్యాలూ ప్రభుత్వమే చెల్లించాలి. డీజిల్‌ వ్యయం కూడా భరించాలి. వెయ్యి బస్సులు కొనాలి. నష్టాలను ఆపాలి. అయినా సామాన్యుడిపై భారం పడకుండా ఉండటానికి పల్లె వెలుగులపై కిలోమీటరుకు 10 పైసలే పెంచాం. పక్క రాష్ట్రంలో 20 పైసలు పెంచారు. పది పైసల పెంపు పెద్ద భారం కాదు’ అని చెప్పారు. అధికారంలో ఉంటే ఒకలా.. విపక్షంలో ఉంటే ఇంకోలా వ్యవహరిస్తారనేది జగన్‌ విషయంలో ఇంకోసారి రుజువైంది. 

Read Also

జగన్ ఎంత ’పవర్ ఫుల్‘ అంటే...
​అమరావతి ఉద్యమంపై దొంగ దెబ్బ​
జగన్‌కు గిఫ్టు పంపిన టీడీపీ నేత.. ఏంటో తెలుసా?