తెలంగాణ సమ్మె దిశగా ఆర్టీసీ సమ్మె

August 14, 2020

ఒక పెద్ద పొరపాటు చిన్న తప్పుతోనే మొదలవుతుంది. చిన్నదే కదా? అని చులకనగా చూడటం.. మితిమీరిన ఆత్మవిశ్వాసం.. దానికి అధికార బలం తోడైనప్పుడు వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను డీల్ చేసే విషయంలో జరిగిన పొరపాటును సీఎం కేసీఆర్ గుర్తించినట్లుగా కనిపించట్లేదు.
అన్ని సందర్భాల్లో తప్పులు చేయకుండా ఉండటం సాధ్యం కాదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో ఇబ్బందులు ఉంటే చర్చలతో పరిష్కరిస్తామని మాట ఇచ్చి.. సమ్మెను విరమించే అవకాశం ఉన్నా.. తొలి అడుగే హెచ్చరికతో మొదలు పెట్టటం ద్వారా కేసీఆర్ వేసిన తప్పటడుగు.. విషయాన్ని అంతకంతకూ ముదిరేలా చేస్తుందే తప్పించి.. తగ్గే పరిస్థితి కనిపించటం లేదు.
నిన్న మొన్నటి వరకూ ఆర్టీసీ కార్మికుల సమ్మెగా మాత్రమే ఉన్న ఈ వ్యవహారం.. ఇప్పుడు తెలంగాణ బంద్ దిశగా అడుగులు పడటం చూస్తే.. ఇష్యూ మరింత ముదురుతోందని చెప్పక తప్పదు. తాజాగా ఆర్టీసీ సమ్మె అంశంపై అన్ని రాజకీయ పార్టీలు.. ఉద్యోగ.. ఉపాధ్యాయ సంఘాల ఐకాస నేతలు సమావేశమయ్యారు.
సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న ఈ సమావేశం పూర్తి అయ్యాక కార్యాచరణను వెల్లడిస్తారని చెబుతున్నారు. సమ్మె ముఖ్య ఉద్దేశం జీత భత్యాలు ఎంతమాత్రం కాదని.. ఆర్టీసీని బతికించుకోవటంగా ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేస్తున్నారు.  కార్మికులు దాచుకున్న పీఎఫ్ మొత్తాన్ని ఎందుకు ఇవ్వటం లేదన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ విచిత్రంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
అవసరమైతే తెలంగాణ బంద్ కు తాము పిలుపునిస్తామని హెచ్చరించిన వైనం చూస్తే.. సమ్మె ఎపిసోడ్ విషయంలో ఒక అడుగు వెనక్కి వేస్తే మంచిదంటున్నారు. ఒకవేళ అందుకు భిన్నంగా మొండిగా వ్యవహరిస్తే మాత్రం కేసీఆర్ కు తిప్పలు తప్పవన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఆర్టీసీ సమ్మె కాస్తా తెలంగాణ బంద్ దిశగా అడుగులు పడితే.. వివిధ సంఘాలుఏకం కావటంతో పాటు ప్రభుత్వానికి మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో పెరిగిన ఒత్తిడిని తగ్గించుకునేందుకు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వానికి మరింత నష్టం చేకూరుస్తాయే తప్పించి.. లాభం కలిగించవన్నది మర్చిపోకూడదు.