కేసీఆర్ చాణక్యం - కీలక నిర్ణయం

February 22, 2020

కామెడీకే కాదు, రాజకీయానికి కూడా టైమింగ్ ఉండాలి. ప్రజలకు ఎంత చేశామన్నది కాదు... ఎపుడు చేశామన్నదే ముఖ్యం. పొలిటికల్ టైమింగ్ లో కేసీఆర్ డిస్టింక్షన్ స్టూడెంట్. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ తప్పు చేశాడని అందరూ అనుకున్నారు. కేసీఆర్ కూడా ఒకానొక దశలో జంకారు. కానీ వేచి చూశారు. అదను చూసి తన వ్యూహం పన్నారు. చివరకు తిట్టించుకున్న వాళ్లకే దేవుడై కూర్చున్నారు. దీనికి కారణం కేవలం టైమింగ్. 

తాజాగా ఆర్టీసీపై ఈరోజు కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ, ఆర్టీసీ ఈడీలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూనియన్లపై దెబ్బేసి ఉద్యోగులకు శుభవార్త చెప్పారు కేసీఆర్. అన్ని నిర్ణయాల్లోకి హైలైట్ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడం. దీనిపై సంతకం కూడా అయిపోయింది.

ఇతర ముఖ్య నిర్ణయాలు పరిశీలిస్తే...  ఆర్టీసీ కార్మిక సంఘాల‌కు షాక్ ఇస్తూ ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డు కృషిచేస్తుంది. ప్రతి డిపో నుంచి, ప్రధాన కార్యాలయం నుంచి ఇద్దరు చొప్పున ఉద్యోగులు మొత్తం 202 మంది బోర్డులో సభ్యులుగా ఉంటారు. ఇందులో 94 మంది బిసిలు, 38 మంది ఎస్సీలు, 26 మంది ఎస్టీలు, 44 మంది ఓసీలు ఉంటారు. మొత్తం సభ్యుల్లో మహిళా ఉద్యోగులు 73 మంది ఉంటారు. బోర్డు సమావేశం డిపో పరిధిలో వారానికి ఒకసారి, రీజియన్ పరిధిలో నెలకు ఒకసారి, కార్పొరేషన్ పరిధిలో మూడు నెలలకు ఒకసారి జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను వింటారు. త్వరగా పరిష్కరిస్తారు.

ఇక ఆర్టీసీ ఆదాయం పెంపునకు సంబంధించి ఆర్టీసీలో కార్గో & పార్సిల్ సేవలపై ప్రణాళిక రచించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాంతాలకు సరుకు రవాణా చేయాలని చెప్పారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించడం, సరుకు రవాణా విభాగాన్ని పటిష్టం చేయడం, కార్మికులకు ఇచ్చిన హమీల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. దీనికోసం ‘ఆర్టీసీ కార్గో అండ్ పార్శిల్ సర్వీస్’ను పటిష్టం చేయాలని నిర్ణయించారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వమే ఈ కార్గో సేవలను ఉపయోగించుకుంటుంది. బతుకమ్మ చీరలు, విద్యా సంస్థలకు పుస్తకాలు, డిపోల నుంచి బ్రాండీ షాపులకు మద్యం, హాస్పిటళ్లకు మందులు ఇలా ప్రభుత్వ సరుకు రవాణా ఇకపై ఆర్టీసీ ద్వారానే జరిగేలా చూడనున్నారు. ప్రజలు కూడా ఈ సేవలు ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. సరుకు రవాణా విషయంలో ఉద్యోుగలకు అవసరమైన ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు.