కార్మికలోకంలో కేసీఆర్ ఒంటరి అవుతారా?

July 07, 2020

తెలంగాణ సీఎం కేసీఆర్ చుట్టూ.. ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు ఒక‌ప్పుడు ఉద్య‌మ నాయ‌కుడు, మా కేసీఆర్ అనే పేరు ఉండేది. ఆయ‌న పేరు చెబితే చాలు.. జేజేలు అయాచితంగా ప్ర‌జ‌ల నోటి నుంచి రాలిపడేవి. అదే ఆయన‌కు 2014లోను, 2019లోను కూడా వ‌ర‌మై.. అధికారాన్ని అందించింది. అయితే, నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేసీఆర్‌ను దేవుడిగా చూసిన ప్ర‌జ‌లే ఇప్పుడు ఆయ‌నను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తు న్నారు. ఇలాంటి నాయ కుడినా.. మేం ఎన్నుకున్న‌ది అని వాపోతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌న కార్మికుల‌తో ర‌గ‌డ‌కు దిగడ‌మే.
ఇంత బ‌తుకు బ‌తికి.. బంగారు తెలంగాణ పుట్టి మూణ్ణాళ్ల‌యినా కాక‌ముందుగానే కేసీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు వినిపించ‌డానికి కార‌ణం ఏంటి? అసలు ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఏరు దాటేవ‌ర‌కు ఏటి మ‌ల్ల‌న్న‌, ఏరు దాటాక బోడి మ‌ల్ల‌న్న -అన్న చందంగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌జ‌లే నేడు క‌ట్ట‌లు తెంచుకున్న ఆగ్ర‌హం మ‌ధ్య వ్యాఖ్య‌లు సంధిస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని చెప్పిన కేసీఆర్ అదికారంలోకి వ‌చ్చినతొలి ఐదేళ్ల కాలంలో ఆ విష‌యాన్నే ప‌క్క‌న పెట్టారు. చేతినిండా డ‌బ్బు ఉన్నా.. చేయాల‌నే ల‌క్ష్యం లేక పోవడంతో అప్పుడు దాట వేత ధోర‌ణిని అవ‌లంబించారు.
ఇక‌, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల నుంచి తీవ్ర మైన ఒత్తిళ్లు వ‌స్తున్నాయి. రెండో సారి అధికారం చేప‌ట్టి ప‌ట్టుమ‌ని ప‌ది మాసాలు కూడా గ‌డ‌వ‌క ముందుగానే కేసీఆర్ ఇటు కార్మిక సంఘాల‌కు, ప్ర‌జ‌ల‌కు కూడా దేవుడు పోయి.. దెయ్యంగా మారిపోయారు. ఏ ప్ర‌భుత్వ‌మైనా.. కార్మిక సంఘాలతోను, కార్మికుల‌తోనూ పెట్టుకుని బ‌ట్ట‌క‌ట్టింది లేదు. ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా కార్మికుల‌దే పైచేయిగా వ‌స్తోంది. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ ఇంత‌కంటే బీరాలు ప‌లికిన సీఎంలు ఎంద‌రో ఉన్నారు.
అయినా కూడా కార్మికుల డిమాండ్ల‌కు చాలా మ‌టుకు త‌లొగ్గాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలాంటిది ఇప్పుడు ఉద్య‌మాల‌కు నెల‌వైన తెలంగాణ‌లో ఉద్య‌మాలు చేసే అర్హ‌తే ఎవ‌రికీ లేద‌ని కేసీఆర్ లాంటి ఉద్య‌మ నాయ‌కుడు వ్యాఖ్య‌లు చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. ఏ నేల‌పై మ‌నం పోరాడామో.. ఆ నేల అడుగుజాడ‌ల‌ను మ‌రిచిపోతున్నాం.. అన్న లియోటాల్ స్టాయ్ వ్యాఖ్య‌లు ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు పూర్తిగా అన్వ‌యం అవుతాయి.
ఉద్య‌మాలతో మ‌మేక‌మై... కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలుగిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే కార్మికుల ప‌క్షాన నిల‌బ‌డాల్సింది పోయి.. వారిని అణిచివేస్తామ‌నే ధోర‌ణిలో అవ‌లంబిస్తున్న పాల‌న క‌డు శోచ‌నీయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌భుత్వం అంటే.. ప‌ట్టువిడుపులు ఉండాల్సిందేన‌ని గ‌తంలో ఇందిర‌మ్మ పాల‌నే నిరూపించింది. నిరంకుశ ప్ర‌వ‌ర్త‌న‌ను అణువ‌ణువునా ఒంట‌బ‌ట్టించుకున్న ఇందిరాగాంధీ ప్ర‌జాభీష్టానికి త‌లవొంచాల్సి వ‌చ్చింది. ఇదే ప‌రిస్థితి రాబోయే రోజుల్లో కేసీఆర్‌కు త‌ప్ప‌ద‌ని, ఆ ప‌రిస్థితి రాకుండా ఆయ‌న జాగ్ర‌త్త ప‌డాల‌ని అంటున్నారు విజ్ఞులు..!